థైరాయిడ్ ఉన్నవాళ్లు అస్సలు ముట్టుకోకూడనివి ఇవే..!
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారికి కొన్ని ఆహారాలు హానికరం. వేరుశనగ, కాలీఫ్లవర్, సోయాబీన్, బ్రోకలీ, గ్లూటెన్ ఉన్న ఆహారాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తాయి.
థైరాయిడ్ మన శరీరంలోని హార్మోన్లు, జీవక్రియ, శక్తి స్థాయిలు, ముఖ్యమైన శారీరక విధులను నియంత్రించే ఒక ముఖ్యమైన గ్రంథి. అయోడిన్ లోపం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, సరికాని జీవనశైలి వంటివి థైరాయిడ్ సమస్యలకు దారితీస్తాయి. హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం అనే రెండు రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. మీకు ఏ రకమైన థైరాయిడ్ సమస్య ఉన్నా, ఈ ఐదు ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తినకూడని ఐదు ఆహారాలు
vastu_by_radhaa అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడని ఐదు ఆహారాల గురించి సమాచారం ఉంది.
వేరుశనగ
వేరుశనగ అయోడిన్ శోషణను దెబ్బతీస్తుంది. అందుకే థైరాయిడ్ సమస్య ఉన్నవారు వేరుశనగ తినకూడదు. వేరు శెనగతో చేసిన ఇతర ఆహారాలకు కూడా కొంచెం దూరంగా ఉండటమే మంచిది.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్‌లో గోయిట్రోజెన్ అనే పదార్థం ఉంటుంది, ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా అయోడిన్ లోపం ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. అయితే.. ఈ క్యాలిఫ్లవర్ ని పచ్చిగా కాకుండా ఉడకపెట్టినది అయితే.. తీసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో అయితే తినొచ్చు. క్యాలిఫ్లవర్ తో పాటు.. క్యాబేజీ కి కూడా దూరంగా ఉండటం అవసరం.
సోయాబీన్
సోయాబీన్, సోయా ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. సోయా పాలు, సోయా ప్రోటీన్ సప్లిమెంట్స్, టోఫు వంటివి వాడాలనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. సోయాలో ఉండే ఐసోసోర్బైడ్ అనే సమ్మేళనం థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీలో కూడా గోయిట్రోజెన్ ఉంటుంది, ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేసి, గొంతు వాపుకు దారితీస్తుంది. కాబట్టి.. బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మంచిదైనా, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు మాత్రం దీనికి దూరంగా ఉండటమే మంచిది.
గ్లూటెన్ ఉన్న ఆహారాలు
గోధుమ, బార్లీ, మైదా వంటి గ్లూటెన్ ఉన్న ఆహారాలు హషిమోటోస్ వ్యాధి వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. అందుకే గ్లూటెన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ గోధుమ, మైదాలతో చేసే పిజ్జాలు, బర్గర్లు, కేక్ లు లాంటి వాటికి కూడా దూరంగా ఉండటం చాలా అవసరం.
థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఏమి తినాలి?
అయోడిన్ ఉన్న ఉప్పు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటివి తినడం మంచిది. అంతేకాకుండా.. వీలైనంత వరకు రెగ్యులర్ గా వ్యాయామం, యోగా లాంటివి చేయాలి. వైద్యులు సూచించిన మందులను కూడా వాడుతూ ఉండాలి. ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం కూడా చాలా అవసరం. థైరాయిడ్ లెవల్స్ ని బట్టి.. వైద్యులు మందుల డోస్ సూచిస్తారు. ఇక ఈ థైరాయిడ్ మందులను కూడా ప్రతిరోజూ పరగడుపున తీసుకోవాలి అనే విషయం మాత్రం మర్చిపోవద్దు.