Rao Balasaraswathi Devi : తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి (97) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెతో తనకున్న అనుబంధాన్ని రచయిత కాసుల ప్రతాపరెడ్డి పంచుకున్నారు.
(రచయిత కాసుల ప్రతాపరెడ్డి)
లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీ దేవి ‘‘బరువాయె నా మేను’’ అంటూ ఈ లోకాన్ని విడిచిపోయారు. సినిమాలకు సంబంధించి ఆమె తొలి నేపథ్య గాయని. లలిత సంగీత సామ్రాజ్ఞి అమె. తొలి తరం సినీ నటి కూడా. ఇన్ని పాత్రలు పోషించిన రావు బాలసరస్వతీ దేవి తన దేహాన్ని, ఆత్మను ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఇన్నేళ్లు ఈ నేలను ధన్యం చేశారు. ఆమెకు 97 ఏళ్లు.
రావు బాలసరస్వతీ దేవీని నేను కళ్లార చూశానని చెప్పడానికి గర్విస్తాను కూడా. తెలుగు సాహిత్యంలో ఎంఎ పూర్తయిన తర్వాత ఓ మహిళకు ఎంఎ తెలుగు పాఠాలు చెప్పే పనికి కుదిరాను. ఆమె నా ఎంఫిల్ గైడ్ ఆచార్య సుమతీ నరేంద్రకు స్నేహితురాలు. ఓ రోజు ఆ మహిళ ఇంటికి రావు బాలసరస్వతీ దేవి వచ్చారు. ఆమె ముందుగానే నన్ను, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రస్తుత వైస్ చాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావును ఆహ్వానించారు. నేను అప్పటికే ఉదయం దిన పత్రికలో పనిచేస్తున్నాను. ఉదయం దినపత్రికతో పాటు శివరంజని సినిమా పత్రికను కూడా దాసరి నారాయణ రావు నడిపిస్తున్నారు. నేను రావు బాలసరస్వతీ దేవిని ఇంటర్వ్యూ చేసి శివరంజనికి ఇచ్చాను. అందులో అది అచ్చయింది.
నేను సుప్రభాతం వార పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నప్పుడు దాని ఎడిటర్‌గా వాసుదేవరావు ఉన్నారు. ఆయనతో పాటు నేను రావు బాలసరస్వతీ దేవి ఇంటికి వెళ్లాను. అప్పుడు ఆమె చాలా ముచ్చట్లు చెప్పారు. వాసుదేవరావుకు బాలసరస్వతీ దేవి అంటే వల్లమాలిన అభిమానం. ఆయనకే కాదు, మా తరానికీ మా ముందు తరానికి కూడా ఆమె అంటే చాలా ఇష్టం. అసుర (అంబటి సురేంద్రరాజు) గురించి చెప్పనే అవసరం లేదు. రావు బాలసరస్వతీ దేవి మీద ఓ సంచిక తెస్తున్నామని వాసుదేవరావు చెప్పారు. అందులో అచ్చు కోసం నా వద్ద ఉన్న శివరంజని ఇంటర్వ్యూ ప్రతిని ఆయనకు ఇచ్చాను. దాన్ని ప్రచురిస్తామని చెప్పారు, కానీ అది అచ్చు కాలేదు. నా ఇంటర్వ్యూ కాపీ నాకు కాకుండాపోయింది. ఆ ఇంటర్వ్యూలోనే ఆమె లతా మంగేష్కర్‌పై ఆరోపణ చేశారు. హిందీ సినిమాలకు తనను దూరం చేశారని ఆమె చెప్పారు.
అదే విషయాన్ని ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో రావు బాలసరస్వతీ దేవి చెప్పారు. నౌషాద్ దర్శకత్వంలో తమిళ, హిందీ ద్విభాషా చిత్రానికి పాడే అవకాశం వచ్చిందని, తమిళం పాటలు తాను పాడానని చెప్పారు. అది విన్న కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ బొంబాయిలో ఉండిపోవాలని, తాము అవకాశాలు ఇస్తామని చెప్పారని, అదంతా విన్న లతా మంగేష్కర్ ఆమెతో పాడిస్తే తాను మీ సినిమాలకు పాడనని హెచ్చరించారని ఆమె చెప్పారు. దాంతో తాను హిందీ సినిమాలకు పాడే అవకాశాన్ని వదిలేసుకున్నానని చెప్పారు
రావు బాలసరస్వతీదేవి ఇంకా ఎన్నో పాటలు పాడి గానప్రియులను అలరించి వుండేవారు. వివాహం ఆమెను కట్టడి చేసింది. నిజానికి, వివాహం అనేది ఆమె విషయంలో ఓ విషాదకరమైన సంఘటన. ఆమె జీవితానికి ఆంక్షలు పెట్టింది. ఆమె ప్రవత్తిని అణచివేసింది. నిజానికి ఆరవ యేటనే ఆమె పాటలు పాడడం ప్రారంభించారు. దీంతో కె. సుబ్రహ్మణ్యం అనే ఓ ప్రముఖ వ్యక్తి ఆమెను ‘బాల’ అని పిలిచేవారు. దాంతో సరస్వతీదేవి పేరుకు ముందు బాల అనేది చేరింది. కోలంక జమీందారీకి చెందిన రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహదూర్‌ను ఆమె వివాహం చేసుకుంది. దాంతో బాల సరస్వతీదేవి ముందు రావు వచ్చి చేరింది. ఆమె అలా రావు బాలసరస్వతీదేవి అయ్యారు.
అయితే రాజావారికి ఆమె సినిమాల్లో నటించడం, పాడడం ఇష్టం లేదు. దాంతో ఆమె సినిమాల్లో నటించడం ఆపేశారు. పాటలు పాడే విషయంలో కూడా ఆంక్షలు మొదలయ్యాయి. దానికి ఆమె బాధపడ్డారు కూడా. అప్పట్లో గాయనీగాయకులు పక్కపక్కన కూర్చుని పాటలు పాడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటిలాగా విడివిడిగా పాడే అవకాశం లేదు. ఘంటసాల పక్కన కూర్చుని బాల సరస్వతీదేవి పాడడం రాజావారికి నచ్చలేదు. దాంతో ఆయన ఘంటసాలకు హెచ్చరికలాంటిది చేశాడు. సాలూరు రాజేశ్వరరావును కూడా ఆయన మందలించాడు. సాలూరు రాజేశ్వరరావుతో రావు బాలసరస్వతీదేవికి సంగీతానికి, గానానికి సంబంధించిన సాన్నిహిత్యం ఉండేది. అది రాజావారికి ఏ మాత్రం ఇష్టం లేదు. రాజావారి మందలింపుతో సాలూరు రాజేశ్వర రావు సరస్వతీదేవికి ఓ దండం పెట్టి అవకాశాలు ఇవ్వడం మానేశారు.
తన వివాహంపై బాలసరస్వతీ దేవి ఓ సందర్భంలో స్పందించారు కూడా. తనకు అది ఇష్టం లేని వివాహమని చెప్పారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు ఉండేది కాదని ఆమె చెప్పారు. వివాహాన్ని ఆమె ఓ విషాదకరమైన సంఘటనగానే ఆమె ప్రస్తావించారు. ఒక అద్భుతమైన గాయనిని ఆయన తన మహల్‌లో కట్టిపడేయాలని ఆనుకున్నాడు.
అయినప్పటికీ ఆమె తెలుగు, హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో రెండువేలకు పైగా పాటలు పాడారు. ఆరవ యేటనే ఆమె హెచ్‌ఎంవీ కంపెనీ ద్వారా ‘నమస్తే ప్రాణనాథ’, ‘ఆకలి సహింపగజాల’, ‘పరమ పురుష’ పరంధామ’ తదితర పాటలతో సోలో రికార్డు ఇచ్చారు. హెచ్‌ఎంవీ ద్వారా ఆమె పాటలు విన్న ప్రముఖ దర్శకుడు సి. పుల్లయ్య ‘సతీ అనసూయ’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమె వయస్సు ఏడేళ్లు. ఈ చిత్రంలో గంగ పాత్రలో నటించి పాడారు. చిన్న వయస్సులోనే సినిమా పాట పాడిన గాయనిగా, నటిగా ఆమె ప్రశంసలు అందుకున్నారు. కె. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నిర్మాణమైన ‘భక్త కుచేల’ చిత్రంలో బాలకృష్ణుడి పాత్ర ధరించారు. ‘బాలయోగిని’ తమిళ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు.
గూడవల్లి రామబ్రహ్మం ‘ఇల్లాలు’ చిత్రంలో ఆమె నటించారు. సాలూరి రాజేశ్వరరావు ఆ చిత్రంలో ఆమె చేత పాటలు కూడా పాడించారు. ద్విభాషా చిత్రం ‘భక్త తుకారాం’ పాత్రలో ఆమె తుకారాం కూతురిగా నటించారు. రెండు భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. డాన్సింగ్ గర్ల్ అనే తమిళ చిత్రంలో నటించారు. పాటలన్నీ సాలూరు రాజేశ్వరరావు ఆమెతోనే పాడించారు. సాలూరు రాజేశ్వరరావుతో కలిసి ఆమె 194I`50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు పాడారు.
వివాహం అయిన తర్వాత నటనకు స్వస్తి చెప్పారు కానీ కొంత కాలం పాటలు పాడడం కొనసాగించారు. కానీ ఆది అంత విరివిగా జరగలేదు. పెళ్లయిన తర్వాత భర్తకు తెలియకుండా సినిమాలకు పాటలు పాడారని అంటారు. సినిమా రంగానికి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో అలా పాడారని చెప్తారు. కానీ ఆమెలోని గాయని ఎప్పటికప్పుడు బయటడుతూ వచ్చిందని చెప్పవచ్చు. ఆమె దాదాపు 1959 వరకు సినిమాలకు పాటలు పాడుతూనే వచ్చారు.
మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రం 1944లో, విజయవాడ ఆకాశవాణి కేంద్రం 1948లో ఆమె లలిత సంగీత కార్యక్రమంతోనే ప్రారంభమయ్యాయి. ఇది తనకు ఎంతో గర్వకారణమని కూడా చెబుకుంటుండేవారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన పలు గేయాలను ఆమె రేడియోలో పాడారు.
ఆమె సినిమాలకు పాడిన చివరి పాట ‘సంఘం చెక్కిన శిల్పాలు’లో ‘పోయి రావమ్మ అత్తవారింటికీ అపరంజి బొమ్మ’’ అనేది. ఏమైనా రావు బాల సరస్వతీదేవి గాయనిగా ఒక తరానికి ఆరాధ్యురాలు. తెలుగువారి ఇళ్లతో ఆమె పాటలకు విడదీయరాని అనుబంధం. ఆమెకు నివాళులు.
