తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా తొలి గాయని రావు బాలసర్వతిదేవి కన్నుమూశారు. 97 ఏళ్ల వయస్సులో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.
తెలుగు సినీ సంగీత రంగంలో తీవ్ర విషాదం. టాలీవుడ్ తొలి నేపథ్య గాయనుల్లో ఒకరైన రావు బాలసరస్వతీ దేవి కన్నుమూశారు. 97 ఏళ్ల వయస్సులో పలు అనారోగ్య కారణాల వల్ల ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో స్వగృహంలో ఆమె మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. రావు బాలసరస్వతీ మృతి వార్తతో సంగీత ప్రియులు, సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
రావు బాలసరస్వతి బాల్యం
1928, ఆగస్టు 29న మద్రాసులో పార్థసారథి, విశాలాక్షి దంపతులకు జన్మించిన బాలసరస్వతి, సంగీతం పట్ల చిన్నతనం నుంచే ఆకర్షణ కలిగి ఉండేవారు. వారి తాత మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. కుటుంబ ఆస్తులు ఉన్నప్పటికీ బాలసరస్వతి ఎక్కువగా చదువుకోలేదు. ఆమె విద్యపై ఆసక్తి చూపలేదు. వారి తాతగారు మినహాయించి 1934లో కుటుంబం అంతా గుంటూరుకు తరలివచ్చింది. వారి గుటుంబానికి చెందిన రత్న మహల్ సినిమా థియేటర్ ను చూసుకుంటూ పలు వ్యాపారాలు కూడా వీరి ఫ్యామిలీ చేసింది.
చిన్నతనం నుంచే సంగీతంపై ప్రేమ
చిన్నతనం నుంచే సంగీతం అంటే ఎంతో ఇష్టంతో బాలసరస్వతీ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అలత్తూర్ సుబ్బయ్య వద్ద మూడు సంవత్సరాలు నేర్చుకున్నారు. అనంతరం ఖేల్కర్, వసంత దేశాయ్ వద్ద హిందుస్తానీ సంగీతాన్ని అభ్యసించారు. కె. పిచ్చుమణి వద్ద వీణా, డానియల్ వద్ద పియానో శిక్షణ తీసుకున్నారు. ఆరేళ్ల వయసులోనే హెచ్.ఎం.వి. (HMV) ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" లాంటి పాటలతో సోలో రికార్డులు విడుదల చేశారు.
సినిమా రంగంలోకి
ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, అనేక భాషల్లో పాటలు పాడారు. ‘సతీ అనసూయ’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి తొలి నేపథ్య గానం చేశారు. అనంతరం తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పాటలతో ఆమె పేరు సంపాదించారు. మొత్తం 2000కి పైగా పాటలు ఆమె ఆలపించారు.రావు బాలసరస్వతి గారు తెలుగు సినీ సంగీతానికి బాటలు వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వారి గాత్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి లాంటి దిగ్గజ గాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు.
