ప్రతి సంవత్సరం ఉల్కాపాతం ఏర్పడుతుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియక ఆ అందమైన దృశ్యాన్ని చూడలేకపోతున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 12, 13 రాత్రి ఉల్కాపాతం జరగబోతోంది.
దీపావళినాడు మీరు కాల్చే టపాసులు ఆకాశంలోకి ఎగిరి చుక్కల్లా మెరుస్తూ కింద పడినట్టు కనిపిస్తాయి. అలాంటి నిజమైన దృశ్యాన్ని చూడాలంటే ఈ నెలలో 13వ తారీఖున రాత్రి పూట ఆకాశంలోకి చూడండి. గంటకు 150 ఉల్కలు వర్షంలో కురుస్తాయి. దీన్నే ఉల్కాపాతం అంటారు. ఆకాశంలో జరిగే ఈ ఖగోళ వింతలు చూసేందుకు ఆశ్చర్యకరంగా ఉంటాయి.
నిజానికి ప్రతి ఏడాది ఉల్కాపాతం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు జరుగుతుందో ఎంతోమందికి అవగాహన ఉండదు. అది కూడా రాత్రిపూట ఉల్కాపాతం జరిగితేనే దాన్ని మనం చూడగలం. ఈ ఏడాది ఆగస్టు 12, 13 రాత్రి ఈ ఉల్కాపాతం జరిగే అవకాశం ఉంది. నిజానికి ఉల్కాపాతం జూలై నుండే ప్రారంభమైంది. ఆగస్టు 24 వరకు ఇది కొనసాగుతుంది. మన దేశంలో ఉల్కాపాతాన్ని చూడాలంటే ఆగస్టు 12 లేదా 13 రాత్రి ఉత్తమమైనది. ప్రతి రెండు మూడు నిమిషాలకు ఉల్కలు కింద పడడం చూడవచ్చు. ఈ రెండు రాత్రులలో మీరు ప్రతి గంటకు 150 ఉల్కలు చూసే అవకాశం ఉంది. అయితే పౌర్ణమి తర్వాత వచ్చే ఈ ఉల్కాపాతం వల్ల ఆ ఉల్కల ప్రకాశం కాస్త తగ్గించవచ్చు. అయినా కూడా ఎంతో అందంగా ఉంటుంది.
ఎప్పుడు చూడాలి?
ఉల్కాపాతం ఉదయం పూట జరిగిన కూడా మన కళ్ళు గుర్తించలేవు. భారతదేశంలో ఈ ఉల్కాపాతం చూడాలంటే మారుమూల గ్రామాలు లేదా చీకటి ప్రదేశాలు ఉత్తమమైనవి. మీ చుట్టూ ఉన్న భూమి అంతా చీకటిగా ఉన్నప్పుడు ఆకాశంలోని చిన్న నక్షత్రం కూడా ఎక్కువ వెలుగుతో కనిపిస్తుంది. అలాంటి ప్రాంతానికి వెళ్లి మీరు ఆగస్టు 13 రాత్రి ఆకాశం వైపు చూడండి. ఉల్కలు మెరుస్తూ కిందకి పడడం గుర్తిస్తారు. ముఖ్యంగా కర్ణాటక, ఉత్తరాఖండ్లోని మారుమూల ప్రాంతాలలో ఉల్కాపాతం అందంగా కనిపిస్తుంది. అలాగే గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ లో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. కాశ్మీర్ కి దగ్గరలో ఉన్న స్పితి లోయల్లో కూడా ఇది కనిపించవచ్చు.
ఎక్కడ చూడాలి?
మీకు ఆగస్టు 12, 13వ తేదీల మధ్య చూడడం కుదరకపోతే ఆగస్టు 16 నుండి 20 మధ్య కూడా దీనిని మీరు దర్శించే అవకాశం ఉంది. అయితే మీరు మీ చుట్టూ ఉండే ప్రదేశం మాత్రం చీకటిగా ఉండేలా చూసుకోండి. వీలైతే దగ్గర ఉన్న గ్రామాల్లోకి వెళ్లి రాత్రిపూట లైట్లు ఆగిపోయాక ఆకాశం వైపు ఓపికగా చూడండి. ఉల్కా పాతం కచ్చితంగా మీకు కనిపిస్తుంది. చిన్న చిన్న నక్షత్రాలు కిందకి రాలి పడిపోతున్నట్టు ఉంటాయి. కొన్నిచోట్ల మాత్రం అవి వర్షంలో కురుస్తున్నట్టు కూడా కనిపించవచ్చు. కానీ అవేవీ భూమి పైకి చేరవు. వాతావరణంలోనే ధూళిగా మారిపోతాయి.
ఉల్కా పాతం అంటే ఏమిటి?
ఉల్కాపాతం ఒక ఖగోళ సంఘటన. తోకచుక్క నుంచి కణాలు భూమి వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల ఇది సంభవిస్తుంది భూమి తన కక్ష్యలో తాను తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు తోకచుక్కలు లేదా గ్రహ శకలాల శిధిలాలలో ఏర్పడిన కణాల మార్గం గుండా వెళ్లాల్సి రావచ్చు. ఆ సమయంలో ఆ కణాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలితో ఘర్షణ పొందుతాయి. అప్పుడు అవి వేడెక్కి ఉల్కలుగా మారి రాలిపోతాయి. ఒక్కొక్కసారి ఆ ఉల్కలు పూర్తిగా మండిపోతాయి. కొన్ని పెద్దవిగా ఉంటే అవి నేల మీద కూడా పడతాయి. వాటిని ఉల్కా ఖండాలు అని కూడా పిలుస్తారు.
కొన్ని ఉల్కా పాతాలు ప్రతి ఏడాది ఒకే సమయంలో సంభవిస్తాయి. ప్రతి ఏడాది ఆగస్టులో పెర్సీడ్స్ అనే ఉల్కాపాతం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ లో లిరిడ్స్ అనే ఉల్కాపాతం జరుగుతుంది. ఈ ఉల్కాపాతాలను చూసేందుకు చీకటిగా ఉన్నా గ్రామాల్లో రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే చాలు.
