Motivational story: సాధారణ వ్యక్తి డ్రైవర్ గా కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు ఏకంగా విమాన సంస్థ నడిపిస్తున్నారు. అతడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. ఆయన తన పట్టుదలతో 'శంఖ్ ఎయిర్' అనే కొత్త విమానయాన సంస్థను ప్రారంభించారు.
ఆకాశమే నీ హద్దురా సినిమా చూసే ఉంటారు. అందులో సాధారణ వ్యక్తిలా ఉండే సూర్య.. తరువాత సొంత విమాన సంస్థను నడిపిస్తారు. ఆ సినిమాలో జరిగినట్టు నిజజీవితంలో సాధించాడు ఒక వ్యక్తి. డ్రైవర్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు విమానయాన సంస్థను ప్రారంభించారు. అతడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. ఒకప్పుడు సాధారణ టెంపో డ్రైవర్‌గా పనిచేసిన అతను, ఇప్పుడు ఏకంగా ఓ కొత్త విమానయాన సంస్థకు యజమాని అయ్యాడు. అదెలాగో తెలుసుకోండి.
ఎవరీ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ?
శ్రవణ్ కుమార్ విశ్వకర్మ కాన్పూర్‌కు చెందిన వ్యక్తి. ఏడేళ్ల క్రితం వరకు ఆ నగరంలో ఒక సాధారణ లోడర్‌గా, టెంపో డ్రైవర్‌గా పనిచేసేవాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రవణ్‌కు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. 2014లో ఆయన జీవితం ఒక మలుపు తిరిగింది. మొదట ఆయన సిమెంట్ వ్యాపారం ప్రారంభించాడు. అక్కడ విజయం దక్కడంతో.. అక్కడ వచ్చిన డబ్బుతో స్టీల్, మైనింగ్, రవాణా రంగాల్లోకి అడుగుపెట్టాడు. కష్టపడి పనిచేసి ఇప్పుడు 400కు పైగా లారీలతో ఒక పెద్ద రవాణా సంస్థను నడుపుతున్నాడు. ఇప్పుడు డబ్బుతో పాటూ ఆత్మ విశ్వాసం పెరిగింది. నాలుగేళ్ల క్రితం 'ఎయిర్‌లైన్' ప్రారంభించాలనే తన కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
'శంఖ్ ఎయిర్' ప్రారంభం
శంఖ్ ఎయిర్ పేరుతో శ్రవణ్ కుమార్ విమాన సంస్థను ప్రారంభించాడు. దనాికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) లభించింది. ఈ విమాన సర్వీసులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ సంస్థ లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడపాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట 3 ఎయిర్‌బస్ (Airbus) విమానాలతో సేవలు మొదలుపెట్టి, రాబోయే కొద్ది నెలల్లో వాటి సంఖ్యను 5కి పెంచుతారు. శ్రవణ్ మాట్లాడుతూ విమానం కూడా బస్సు లేదా టెంపో లాంటి ఒక రవాణా వాహనం మాత్రమే. అది అందరికీ అందుబాటులోకి రావాలని శ్రవణ్ ఆలోచన. అందుకే మధ్యతరగతి ప్రజలు కూడా ప్రయాణించేలా తక్కువ ధరలకే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాను సాధించిన విజయం గురించి శ్రవణ్ మాట్లాడుతూ "నేను పెరిగిన వాతావరణంలో పూట గడవడమే కష్టంగా ఉండేది. దానికి మించి కలలు కనడం చాలా పెద్ద విషయంగా అనిపించేది. కానీ ఓటములు నన్ను ఆపలేదు. అవి నాకు పాఠాలు నేర్పించాయి" అని భావోద్వేగంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న తొలి ప్రైవేట్ విమానయాన సంస్థగా ఇప్పుడు ‘శంఖ్ ఎయిర్’ చరిత్రలో నిలిచిపోతుంది.


