ఒకప్పటి లవర్‌ బాయ్స్ ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌లపై యంగ్‌ హీరో త్రిగుణ్‌(అరుణ్‌ ఆదిత్) షాకింగ్‌ కామెంట్స్ చేశారు. అలా చేస్తే తాను కూడా వారిలానే అవుతానంటూ వ్యాఖ్యానించారు.

ఒకప్పటి లవర్‌ బాయ్స్, కోట్లాది మంది అమ్మాయిల మనసులను దోచుకున్న క్రేజీ హీరోలు ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌. వీరి కోవలోకి వరుణ్‌ సందేశ్‌ కూడా వస్తాడు. వీరంతా లవ్‌ స్టోరీ సినిమాలు చేసి ఎంతో పాపులర్‌ అయ్యారు. స్టార్లుగా రాణించారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఉదయ్‌ కిరణ్‌ మరణించిన విషయం తెలిసిందే. తరుణ్‌, వరుణ్‌ సందేశ్‌లకు సినిమాలు తగ్గిపోయాయి. అయితే వీరి ఫెయిల్యూర్‌కి కారణం మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేయకపోవడమే అనే టాక్‌ వినిపిస్తుంటుంది. 

యంగ్‌ హీరో త్రిగుణ్‌(అరుణ్‌ ఆదిత్) కూడా ఇదే విషయాన్ని తెలిపారు. లవ్‌స్టోరీలు చేసుకుంటూ పోతే తాను కూడా ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌, వరుణ్‌ సందేశ్‌లాగా మిగిలిపోతానని తెలిపారు. అందుకే మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేయాలనుకున్నట్టు తెలిపారు. తన ఆలోచనని రామ్‌గోపాల్‌ వర్మతో పంచుకున్నానని, ఆయన అలాంటి స్క్రిప్ట్ వస్తే చెబుతానని, కొన్నాళ్ల తర్వాత `కొండా` సినిమా ఆఫర్‌ చేశారని తెలిపారు త్రిగుణ్‌. ఈ సినిమాకి ముందు చాలా రీసెర్చ్ చేశామని, కానీ కొండా సురేఖ, కొండ మురళీలను కలిశాక ఈ బయోఫిక్షన్‌ సెట్‌ అయ్యిందన్నారు. 

తాను ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌లాగా మిగిలిపోకూడదని నిర్ణయించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు త్రిగుణ్‌. అంతేకాదు.. ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ లేని వారు రాణించడం కష్టమని, చాలా మంది తొక్కేస్తారనే కామెంట్లు వినిపిస్తుంటాయని, తొక్కితే తొక్కించుకుంటానని, కానీ అంతే వేగంగా, బలంగా లేస్తానని తెలిపారు త్రిగుణ్‌. తాను ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇక్కడి వరకు వచ్చానని, భయపడేవాడిని, వెనక్కితగ్గే వాడిని కాదని చెప్పారు. తన సినీ కెరీర్‌లో ఎన్నో లేయర్స్ ని దాటుకుంటూ, వాటిని బ్రేక్‌ చేసుకుని వచ్చానని తెలిపారు. ఇంజనీరింగ్‌ తప్పడం వల్లే సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. 

వర్మ రూపొందించిన `కొండా` సినిమాతో తన పేరుని త్రిగుణ్‌(అరుణ్‌ ఆదిత్‌)గా మార్చుకున్నానని, అమ్మ పెట్టిన పేరు అని, ఆమెకి ఇష్టమైన పేరు అని తెలిపారు. తనని తాను రీబ్రాండ్‌ చేసుకోవాలనే పేరు మార్చుకున్నానని, ఈ విషయం చెప్పినప్పుడు వర్మ షాక్‌ అయ్యారని, బట్‌ క్రేజీగా ఉందని ఆయన ఓకే చెప్పినట్టు వెల్లడించారు త్రిగుణ్‌. పేరు మార్చుకున్నాక కెరీర్‌లో చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు వరుసగా సినిమాల లైనప్‌ ఉందన్నారు. `కిరాయి`, `గంజం`, `వర్క్ ఫ్రమ్‌ హోమ్‌`, మిష్కిన్‌తో ఓ సినిమా, కన్నడలో `లైన్‌మేన్‌`, `ప్రేమదేశం`తోపాటు మరో రెండు చిత్రాలున్నట్టు తెలిపారు.

ఇక కొండా సినిమా గురించి చెబుతూ, ఇది బయో ఫిక్షన్ అని, కొండా మురళి, సురేఖమ్మ పాత్రలు రెండు పిల్లర్స్ లాగా ఉంటాయన్నారు. ఉద్యమంలో వారి మధ్యలో పుట్టిన ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆకట్టుకునే అంశమన్నారు. ఉద్యమంలో, ప్రేమ విషయంలో, పెళ్లి తర్వాత ఇద్దరు ఒకరికి ఒకరు ఎలా తోడున్నారనేది ఆకట్టుకుంటుందన్నారు. వారి కెరీర్‌లోని పీక్ మూవ్‌మెంట్స్ ని చూపిస్తున్నట్టు తెలిపారు.