Asianet News TeluguAsianet News Telugu

ఏపీ టికెట్‌ రేట్లపై ఎట్టకేలకు స్పందించిన మోహన్‌బాబు.. `ఇండస్ట్రీ యూనిటి`పై ఘాటు వ్యాఖ్యలు

టికెట్ల రేట్ల సమస్యపై ఎట్టకేలకు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమపైనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసింది. అందరిని కలుపుకు పోవడం లేదని, కలిసి కట్టుగా పనిచేయాలని చురకలంటించారు.

mohanbabu tweet on tickets rates and tollywood problems
Author
Hyderabad, First Published Jan 2, 2022, 7:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్ల రేట్ల సమస్యపై ఎట్టకేలకు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమపైనే ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసింది. అందరిని కలుపుకు పోవడం లేదని, కలిసి కట్టుగా పనిచేయాలని చురకలంటించారు. కలిసి ఇరువురు ముఖ్యమంత్రులను గౌరవించుకోవాలని, మన పరిశ్రమ సమస్యలను విన్నవించుకోవాలని తెలిపారు. సినిమాకి దేవుడు లాంటి నిర్మాతలు,  ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరించడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మోహన్‌బాబు ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. 

ఇందులో మోహన్‌బాబు చెబుతూ, `మనకెందుకు మనకెందుకు అని మౌనంగా వుండాలా? , నా మౌనం చేతకానితనం కాదు. చేవలేనితనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా వుంటాయ్, కఠినంగా వుంటాయ్, కానీ నిజాలే వుంటాయ్. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. వాళ్ళు చెప్పినట్టు బతకాలా? నాకు నచ్చినట్టు బతకాలా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట` అని తెలిపారు. 

ఇంకా చెబుతూ, `అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుందనేది చర్చించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది..? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా.. సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు,  అందరూ సమానం. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్ళి సమస్యల్ని వివరిస్తే మనకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు.

సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం, కాదనను. కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి. వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మన కష్టసుఖాలు చెప్పుకోవాలి! అలా జరిగిందా? జరగలేదు. నేను `మా` అధ్యక్షుడిగా ఉన్న టైంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్ని కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి సి.ఎం. డా॥ రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి బిక్ష పెట్టండి అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు.. కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం` అని అప్పటి విషయాలను పేర్కొన్నారు. 

ఇక ప్రస్తుతం  తెలంగాణలో, ఏపీలో ఉన్న టికెట్ల రేట్లపై ఆయన స్పందిస్తూ, `350 రూపాయలు, 300 రూపాయల టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. 50 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడ్డం కష్టం. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి 'అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది., చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ వున్నాయి. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు... కానీ ఈరోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం` అని వెల్లడించారు మోహన్‌బాబు. 

ఇదిలా ఉంటే ఈ పోస్ట్ పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. `మా` ఎన్నికల సమయంలోనూ ఇదే మాట మోహన్‌బాబు చెప్పారని, ఇరువురు సీఎంలను కలిసి గౌరవించుకోవాలని, ఇండస్ట్రీ సమస్యలను తెలియజేయాలన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమయ్యారు. టికెట్ల రేట్ల సమస్యతో నిర్మాతలు ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లు ఆయన ఎందుకు మౌనం వహించారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీపైనే విమర్శలు చేస్తున్నారని,  ఇది బాధ్యతాయుతం కాదని అంటున్నారు నెటిజన్లు. మరోవైపు రేపు మోహన్‌బాబు.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కి టికెట్ల సమస్యలపై లేఖ రాయబోతున్నారని సమాచారం. 

also read: సినిమా టికెట్ల వివాదం: మోహన్ బాబు స్పందన.. రేపు జగన్‌కు లేఖ రాయనున్న పెదరాయుడు

also read: Chiranjeevi: ఇద్దరు కొట్టుకుంటే పంచాయతీ చేయను, ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. తేల్చి చెప్పేసిన చిరంజీవి

Follow Us:
Download App:
  • android
  • ios