రివ్యూ: వైఫ్ ఆఫ్ రామ్

w/o ram movie telugu review
Highlights

రెండు నిమిషాల సుఖం కోసం క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయని, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని తన కథ ద్వారా చెప్పిన దర్శకుడు విజయ్ ను అభినందించాలి. ఎగ్జిక్యూషన్, కాస్టింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే  దర్శకుడిగా అతడిని మంచి గుర్తింపు లభించి ఉండేది

నటీనటులు: మంచు లక్ష్మి, సామ్రాట్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియదర్శి 
సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్ 
సంగీతం: రఘు దీక్షిత్
ఎడిటర్ : తమ్మిరాజు
నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు
రచన, దర్శకత్వం: విజయ్ యెలకంటి

ఓ పక్క టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సినిమాల్లో కూడా నటిస్తోంది మంచు లక్ష్మీ. గతేడాది ఆమె నటించిన 'లక్ష్మీబాంబ్' సినిమా నిరాశ పరచడంతో ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందించిన 'వైఫ్ ఆఫ్ రామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
యాక్సిడెంట్ లో రోడ్ మీద పడి ఉన్న దీక్షా(మంచు లక్ష్మీ)ను హాస్పిటల్ లో చేరుస్తారు. ఆ యాక్సిడెంట్ కారణంగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతుంది. తన భర్త కూడా చనిపోయినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. కళ్లు తెరిచిన తరువాత దీక్షా తన భర్తను ఎవరో లోయలోకి తోసి చంపేశారని ఆమెను బలంగా నెట్టడంతో కింద పడిపోయినట్లు చెబుతుంది. దీంతో యాక్సిడెంట్ అనుకున్న కేసు కాస్త మలుపు తీసుకుంటుంది. ఈ కేసుని పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో దీక్షా స్వయంగా తన భర్తను ఎవరు చంపారో తెలుసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడుతుంది. కానిస్టేబుల్ చారి(ప్రియదర్శి) ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఫైనల్ గా తన భర్తను చంపింది రాకీ(ఆదర్శ్) అని తెలుసుకుంటుంది. ఎవరు ఈ రాకీ..? రామ్ కు అతడిని చంపాల్సిన అవసరం ఏంటి..? అసలు రామ్ ను చంపింది అతడేనా..? లేక మరెవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా..? చివరకు దీక్షా.. రాకీని ఏం  చేసింది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
హిందీలో వచ్చిన 'కహాని' సినిమాను తెలుగులో 'అనామిక' సినిమాగా తీశారు. ఈ వైఫ్ ఆఫ్ రామ్ సినిమా కూడా దాదాపు అలాంటి కాన్సెప్టే.. కానీ ఇక్కడ అమ్మాయిల రక్షణ అనే పాయింట్ ను యాడ్ చేశారు. ఆడపిల్లలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు మెయిన్ పాయింట్ గా కథను రాసుకున్నాడు. కానీ చివరివరకు ఆ పాయింట్ ను టచ్ చేయలేదు. కథ మొత్తం ఇన్వెస్టిగేషన్ మీదే నడుస్తుంటుంది. తన భర్త ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనే తాపత్రయంతో ఒక మహిళ ఎలాంటి రిస్క్ చేసి ఆధారాలు సేకరించింది అనే విషయంపై సినిమా మొత్తం నడిపించారు. ఇలాంటి కథల్లో ప్రతి సీన్ ఆసక్తి కలిగించాలి.. నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీను కలిగించాలి. కానీ ఈ కథను అంత ఇంట్రెస్టింగ్ గా రూపొందించలేకపోయారు.

హీరోయిన్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా కూడా అనిపించదు. సెకండ్ హాఫ్ వరకు ఒకే విధంగా సాగుతున్న కథలో సడెన్ గా ట్విస్ట్ వస్తుంది. అప్పటివరకు సినిమా కాస్తో కూస్తో కొత్తగా అనిపించినా ట్విస్ట్ రివీల్ అయిన తరువాత ఇది కూడా రెగ్యులరే కదా అనిపించకమానదు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ సందేశాత్మకంగా ఉన్నప్పటికీ ఆ కథను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేవిధంగా తీయలేకపోయారు. హీరోయిన్ బేస్డ్ నడిచే కథ కోసం మంచు లక్ష్మీను ఎంపిక చేసుకోవడం దర్శకుడి అనుభవలోపమని చెప్పొచ్చు. ఇదే కథలో మరే నటి ఉన్నా.. రిజల్ట్ మరో విధంగా ఉండేది. మంచు లక్ష్మీ నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం వర్కవుట్ కావడం లేదు. కనీసం డబ్బింగ్ విషయంలోనైనా.. జాగ్రత్తలు తీసుకొని ఉంటే  బాగుండేదేమో.. ఆమెకు మాత్రమే వచ్చే తెలుగు యాక్సెంట్ లో డైలాగ్స్ చెప్పిన తీరు ఎంతమాత్రం మెప్పించదు సరికదా థియేటర్ నుండి ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా అనిపిస్తుంది.

సామ్రాట్ తో మంచు లక్ష్మీ పెయిర్ అంతగా సెట్ కాదని దర్శకుడు ముందే ఊహించినట్లు ఉన్నాడు. అందుకే వారి కాంబినేషన్ సీన్స్ కూడా పెద్దగా పెట్టలేదు. కనిపించే ఒకట్రెండు సన్నివేశాలు కూడా చూడడానికి కష్టంగా అనిపిస్తాయి. ఆదర్శ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించాడు. ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమాను మంచి క్వాలిటీతో రూపొందించారు. నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి. పతాక సన్నివేశాలు మరింత క్రిస్ప్ గా ఉంటే  బాగుండేవి.రెండు నిమిషాల సుఖం కోసం క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయని, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని తన కథ ద్వారా చెప్పిన దర్శకుడు విజయ్ ను అభినందించాలి. ఎగ్జిక్యూషన్, కాస్టింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే  దర్శకుడిగా అతడిని మంచి గుర్తింపు లభించి ఉండేది. ఇప్పుడు మాత్రం బొటాబొటీ  మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

రేటింగ్: 2/5 

loader