నిజానికి ఈపాటికే బాల‌కృష్ణ-తేజ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ మొదలుకావాల్సింది. నటీనటుల ఎంపిక కాస్త సవాల్‌తో కూడుకోవడం.. స్క్రిప్ట్‌ను కూడా ఒకటికి రెండు సార్లు తరిచి తరిచి చూసుకోవడం.. ఇలా ఆచీతూచీ వ్యవహరిస్తుండటం వల్ల సినిమా ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

సరే, బయోపిక్ ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది కాబట్టి ఈలోగా బాలయ్యతో మరో సినిమా ప్లాన్ చేయాలనేది నిర్మాత సి.కల్యాణ్. ఇందుకోసం ఇప్పటికే అడ్వాన్స్ డబ్బులు కూడా ముట్టాయి. కానీ వచ్చిన చిక్కంతా.. దర్శకుడు వినాయక్ తోనే. ప్రస్తుతం సి.కల్యాణ్ చేతిలో వినాయక్ మాత్రమే ఉన్నాడు. సాయిధరమ్ తేజ్‌తో వినాయక్ దర్శకుడిగా సి.కల్యాణ్ ఇంటిలిజెంట్ తీసి చేతులు కాల్చుకున్నాడు. కాబట్టి సి.కల్యాణ్ కు ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసమైనా వినాయక్ మరో సినిమా చేయక తప్పని పరిస్థితి.పైగా ఔట్ డేటెడ్ దర్శకుడిగానూ ముద్ర వేసుకుంటున్న వినాయక్ చేతిలో ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా ఏమి లేవు. కాబట్టి బాలయ్యతో సినిమా కమిట్ అయేందుకు ఆయనకు వచ్చిన ఇబ్బందేంటి అనేది చాలామంది సందేహం. అయితే వినాయక్ కారణాలు మాత్రం వినాయక్ కు ఉన్నాయి. బాలయ్యతో సినిమా తేడా కొడితే.. ఇక తన పని అంతే అని భయపడుతున్నాడట.

వినాయక్ మీద మెగా కాంపౌండ్ ముద్ర బలంగా ఉంది. బాలయ్యతో సినిమా చేసి గనుక ఫ్లాప్ మూటగట్టుకుంటే.. నందమూరి ఫ్యాన్స్ నుంచి తనపై ఎటాక్ తప్పదని వినాయక్ భయపడుతున్నాడట. పైగా కావాలనే తమ హీరోను ఇంత తీసికట్టుగా తెరకెక్కించాడన్న విమర్శలూ వస్తాయని ఆలోచిస్తున్నాడట. ఈ కారణాలతోనే బాలయ్య పేరెత్తితేనే వినాయక్ జంకుతున్నట్టు టాక్.

వినాయక్ భయం సంగతెలా ఉన్నా.. గతంలో బాలయ్యతో ఆయన తీసిన చెన్నకేశవరెడ్డి సినిమాకు మాత్రం మంచి స్పందనే లభించింది. సినిమా ఓ మోస్తరుగానే ఆడినప్పటికీ.. బాలయ్య క్యారెక్టరైజేషన్ ను బలంగా చూపించగలిగాడు వినాయక్. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వినాయక్ కు బాలయ్య నుంచి హెచ్చరికలు తప్పలేదట. వినాయక్ తీరుపై బాలయ్య కాస్త ఆగ్రహం ప్రదర్శించడంతో.. అప్పటినుంచి బాలయ్య అంటే మరింత భయం ఏర్పడిందట. అందుకే బాలయ్యతో సినిమా అంటే.. ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట వినాయక్.