Asianet News TeluguAsianet News Telugu

'అర్జున్ రెడ్డి'తో నా ఆటిట్యూడ్ మారింది: విజయ్ దేవరకొండ

ఇండస్ట్రీకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ఎదురుదెబ్బలనే తను కూడా ఎదుర్కొని టాలెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతామని నిరూపించాడు విజయ్ దేవరకొండ

vijay devarakonda birthday special interview

ఇండస్ట్రీకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ఎదురుదెబ్బలనే తను కూడా ఎదుర్కొని టాలెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతామని నిరూపించాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి'తో యూత్ మొత్తానికి దగ్గరైన ఈ నటుడు మే 9న పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా అతడితో కాసిన్ని ముచ్చట్లు. 

ఈ పుట్టినరోజు ఎలా జరుపుకునున్నారు..?
నేను అసలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోను. ఈ జీవితం నేను కోరుకుంది కాదు. పుట్టడం కూడా నేను కోరుకోలేదు. నేనేం చేశానని బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తుంటుంది.   

'అర్జున్ రెడ్డి' తరువాత మీలో ఏమైనా మార్పు వచ్చిందా..?
అవును.. నేను మారాను. మన జీవితంలో జరిగే సంఘటనల కారణంగా మారుతూ ఉంటాం. పరిస్థితులకు తగ్గట్లుగా ప్రతి ఒక్కరూ మారాల్సిందే. అలానే నాలో కూడా మార్పు వచ్చింది. 

అది ఎలాంటి మార్పు..?
ముందు ఒకలా కథలను ఎంపిక చేసేవాడిని. అర్జున్ రెడ్డి తరువాత స్క్రిప్ట్ పట్ల నా ఆటిట్యూడ్ మారిపోయింది. 

కొన్ని విషయాలపై చాలా బోల్డ్ గా కామెంట్ చేస్తుంటారు. అది అటెన్షన్ కోసమేనా..?
నాకు చెప్పాలనిపించిందే నేను చెప్తా.. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది నాకు తెలియదు. పరిస్థితులకు తగ్గట్లు రియాక్ట్ అవుతుంటాను. ఫోన్ వెనుక దాక్కొని నేనేం చేయను. ఏదైనా డైరెక్ట్ గానే చేస్తా..

విజయ్ దేవరకొండ ఇప్పుడు మహానటిలో విజయ్ ఆంటోనీగా మారాడు. ఛాన్స్ ఎలా వచ్చింది..?
అర్జున్ రెడ్డి సినిమా తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నా.. అప్పుడు స్వప్నక్క(స్వప్నా దత్) ఫోన్ చేసి మహానటిలో నటించాలని చెప్పింది. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. తన డైరెక్షన్ అంటే సంతోషపడ్డాను. సినిమాలో చాలా చిన్న రోల్ లో కనిపిస్తాను. నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాకుంటే వైజయంతి బ్యానర్ లో నిర్మించకపోతే అసలు సినిమా చేసేవాడ్ని కాను. 

ఈ సినిమాతో మీరు ఎలాంటి సక్సెస్ అందుకుంటాననుకుంటున్నారు..?
మహానటి నా సినిమా కాదు.. సావిత్రి గారి సినిమా. నేనొక పాత్ర పోషించాను అంతే. విజయ్ ఉన్నాడనే సినిమా టికెట్ కొన్నారంటే మాత్రం దానికి పూర్తి న్యాయం చేశాననే అనుకుంటున్నాను. మొదట నన్ను జెమినీ గనేషన్ రోల్ లో నటిస్తావా అని అడిగారు. నేను షాక్ అయ్యాను. అదొక ఛాలెంజ్ అవుతుంది. నేను ఇప్పటివరకు రియల్ లైఫ్ క్యారెక్టర్ రోల్స్ లో నటించింది లేదు. వెంటనే కొన్ని పాత సినిమాలు చూశాను. కొంచెం భయపడ్డాను సో నో చెప్పలనుకున్నాను. కానీ నాకు ధైర్యం లేదా..? అనిపించింది. అయితే మూడు రోజుల తరువాత డైరెక్టర్ ఫోన్ చేసి దుల్కర్ ఓకే చెప్పాడని చెప్పగానే హమ్మయ్యా అనుకున్నాను. 

సమంతతో నటించడం ఎలా అనిపించింది..?
సమంత పోషించిన మధురవాణి పాత్రకు సపోర్టింగ్ క్యారెక్టర్ లాంటిది. సమంత హిలరియాస్ పర్సన్. 

తమిళంలో నటించడం ఎలా అనిపిస్తోంది..?
తమిళంలో 'నోటా' అనే సినిమాలో నటిస్తున్నాను. తెలుగులో మూడు పేజీల డైలాగ్స్ ను మూడు నిమిషాల్లో చెప్పేస్తాను. కానీ అదే తమిళంలో మూడు రోజులు పడుతుంది. రిస్క్ తీసుకుంటేనే ఏమైనా చేయగలం. తెలుగే కాదు తమిళంలో కూడా చేయగలనని నిరూపించడానికే ఈ సినిమా చేస్తున్నా .. 

అర్జున్ రెడ్డి సీక్వెల్ ఉంటుందా..?
నిజానికి అర్జున్ రెడ్డి 40 ఇయర్స్ తరువాత ఎలా ఉంటాడనేది నా ఐడియా. తనకు కూతురు పుడితే తను ప్రేమలో పడితే ఎలా రియాక్ట్ అవుతాడు ఇలా చాలా ఆలోచనలు వచ్చాయి. కానీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది తెలియదు. 

'అర్జున్ రెడ్డి'లో మీరు వాడిన ఒక బూతు పదం ఇప్పటికీ వివాదాలను సృష్టిస్తూనే ఉంది. మీరేం అంటారు..?
ఆ టైం లో అర్జున్ రెడ్డి ఆ పదం వాడడం సినిమాకు అవసరం, నాకు బయట అలా జరిగితే అలానే రియాక్ట్ అవుతా. అది కరెక్ట్ అని నేను అనడం లేదు. కానీ అదొక రియాక్షన్ అంతే.. సమయం, సందర్భం లేకుండా ఆ పదాలు వాడితే అప్పుడు అది కచ్చితంగా తప్పే.. 

టాక్సీవాలా ఎలా ఉండబోతుంది..?
టాక్సీవాలా సినిమా క్యారెక్టర్ డ్రివన్ కథ కాదు. కొత్త కాన్సెప్ట్. ఒక టాక్సీ డ్రైవర్ కు విచిత్ర పరిస్థితులు ఎదురవుతుంటే ఎలా రియాక్ట్ అవుతాడనేదే సినిమా. ఆడియన్స్ సినిమా చూసి నవ్వుతారు, అరుస్తారు అలా సాగుతుంటుంది సినిమా. 

కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా..?
భరత్ కమ్మ అనే నూతన దర్శకుడితో 'డియర్ కామ్రేడ్' అనే సినిమా చేయనున్నాను. యాక్షన్, డ్రామా నేపధ్యంలో సినిమా సాగుతుంది. పెళ్లిచూపులు నిర్మాతలతో కూడా ఓ కమిట్మెంట్ ఉంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios