తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత మహేంద్ర కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

తెలుగు సినిమా పరిశ్రమకు సేవలందించిన ప్రముఖ నిర్మాత కె. మహేంద్ర ఇక లేరు. ఆయన గుంటూరులోని తన స్వగృహంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. సినీ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్రవేసిన మహేంద్ర మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

1946 ఫిబ్రవరి 4న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా దోసపాడు గ్రామంలో జన్మించిన కావూరి మహేంద్ర, కె. ప్రత్యగాత్మ, కె. హేమాంబరధరరావు వంటి ప్రముఖుల వద్ద దర్శక శాఖలో శిక్షణ పొందారు. ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన, 1977లో 'ప్రేమించి పెళ్లి చేసుకో' సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యారు.

ఆయన నిర్మించిన చిత్రాలు సినీ సాంకేతిక నాణ్యతకు మారుపేరుగా నిలిచాయి. ఏది పుణ్యం? ఏది పాపం?, ఆరని మంటలు, తోడు దొంగలు, బందిపోటు రుద్రమ్మ, ఎదురులేని మొనగాడు, ఢాకూరాణి, ప్రచండ భైరవి, కనకదుర్గ వ్రత మహాత్మ్యం వంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.

మహేంద్రకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మహేంద్ర కుమార్తెను నటుడు మాదాల రవి వివాహం చేసుకున్నారు. ఆయన కుమారుడు జీతు, కొద్దికాలం క్రితమే మరణించారు. ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర, గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు గుంటూరులోనే నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.తెలుగు సినీ పరిశ్రమలో ఎనలేని సేవలందించిన మహేంద్ర మరణం పట్ల పలువురు చిత్రపరిశ్రమ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.