Asianet News TeluguAsianet News Telugu

బాధితుల కోసం నేను సైతం అంటున్న వర లక్ష్మి

  • మళయాల నటిపై లైంగిక దాడిని తీవ్రంగా నిరసించిన వరలక్ష్మి
  • దాడిని ఖండిస్తూ ట్వీట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్
  • తాజాగా సేవ్ శక్తి అంటూ సంతకాల సేకరణతో మహిళ భద్రతకై ఉద్యమం
varalakshmi sharath kumar fight for justice

నటి భావనపై అత్యాచారయత్న సంఘటన ప్రభావం కథానాయికల్లో చాలా మందిని కదిలించిందనే చెప్పాలి. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నడుం బిగించారు. అందులో భాగంగా సేవ్‌ శక్తి నినాదంతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారికి భద్రత కలిగించే విధంగా అడుగులు వేస్తున్నారు. సేవ్‌శక్తి పేరుతో ఒక సంఘాన్ని ప్రారంభించనున్నారు.

 

మహిళా దినోత్సవం(మార్చి 8)న స్త్రీల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ తాను ఇటీవల ఒక ట్వీట్‌ చేశానన్నారు. అందులో ఒక మహిళగా తన భావాన్ని వ్యక్తం చేశానని పేర్కొన్నారు. అందుకు కారణం సమాజంలో మార్పు రావాలన్న ఆకాంక్షేనని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా సమాజంలో మార్పు తీసుకురాకపోతే, ఇక అది కలగానే మిగిలిపోతుందన్నారు. దీనికి తన వంతు ప్రయత్నంగా సేవ్‌శక్తి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

మహిళల సంతకాలను సేకరించి వాటిని ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిపారు. ప్రతి తాలుకాలో మహిళా కోర్టును ఏర్పాటు చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో ఆరు నెలల్లోగా తీర్పు రావాలన్నారు. అప్పుడే లైంగిక వేధింపులకు గురైనవారు ఆ గాయాలను మరచి నూతన భవిష్యత్తుకు బాటలు వేసుకోగలరు. ఈ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ నెల 8న స్థానిక రాజరత్నం హాలులో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.
 

వేధింపులకు గురైన మహిళలు దాని గురించి మాట్లాడకూడదు అనే సమాజంలో మార్పు రావాలి.  అన్యాయాన్ని ఎదిరించి గొంతు విప్పాలి. లేకుంటే స్త్రీలు ఎప్పటికీ ఆట వస్తువుగానే మిగిలిపోతారు. నేను ఈ పోరాటానికి సిద్ధం కావడానికి ఒక ప్రముఖ నటి బాధింపునకు గురవడం కారణం కాదు. ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు, ఇకపై ఏ మహిళ లైంగిక వేధింపులకు గురి కాకూడదు. అప్పటివరకు తన పోరాటం చేస్తా.

 

ఇక సినిమాకు చెందిన మహిళల కోసం ఏమి చేయనున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని, ఈ విషయంపై ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య)కు విజ్ఞప్తి చేయనున్నాం. స్త్రీల కోసం ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆ విన్నపం. అందులో సినీ నటీమణుల నుంచి ఏ శాఖకు చెందిన మహిళలైనా సభ్యులుగా చేరవచ్చు. వారి సమస్యలను ఆ సంఘానికి చెప్పుకుని వెంటనే పరిష్కారం పొందవచ్చు. అయితే ఆ సంఘానికి సినిమాకు చెందిన వారు కాకుండా ఒక విశ్రాంత న్యాయమూర్తి, ఐపీఎస్‌ అధికారి లాంటి వారిని అధ్యక్షులుగా నియమించాలనుకున్నాం. అప్పుడే బాధితులకు  న్యాయం జరుగుతుందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios