Asianet News TeluguAsianet News Telugu

బయోపిక్స్ వల్ల మళ్లీ తెరపైకి వాణీ,ఎన్టీఆర్ వివాహం వార్తలు

  • నైంటీస్ లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హిరోయిన్ వాణి విశ్వనాథ్
  • సీనియర్ ఎన్టీఆర్ సరసన సామ్రాట్ ఆశోక సినిమాలో నటించిన వాణి
  • అప్పట్లో ఎన్టీఆర్ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ల జాబితాలో వాణి విశ్వనాథ్
  • తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ల వివాదంతో వాణి, ఎన్టీఆర్ వివాహంపై మరోసారి చర్చ
vani vishwanath ntr marriage news doing rounds again

తెలుగునేలపై మహనీయులుగా నిలిచిన అన్న నందమూరి తారకరామారావుకు సాటి లేదనటంలో అతిశయోక్తి లేదు. అలాంటి మహనీయుడు జీవిత చరమాంకంలో అవమానాలు ఎదుర్కొని గుండెపోటుతో మరణించిన సంగతి యావత్ తెలుగు లోకానికి తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్ జీవితం అలా కావటానికి కారణం ఏంటి.. ఎన్టీఆర్ లైఫ్ లో లక్ష్మీపార్వతి పాత్ర ఏంటి అన్నది కొత్త తరాలకు అంతుచిక్కని ప్రశ్న.

 

అలాంటి వివాదాస్పదమైన మహనీయుని జీవితం ఆధారంగా ఇటీవల పలు సినిమాలకు రూపకల్పన జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితం పై సినిమా తీస్తానని ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ కంకణం కట్టుకున్నారు. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్లో సినిమా తెరకెక్కనుందని.. ఇప్పటికే.. దర్శకుడు తేజతో ఈ మూవీ కథపై చర్చలు జరిగాయని, కథ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు వివాదాస్పద దర్శకుడుగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించబోయే సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా ఎనౌన్స్ చేశాడు. ఈ చిత్రంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ను ప్రభావితం చేసిన తీరు,ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక జరిగిన పరిణామాలన్నీ క్రోఢీకరించి భారీ సినిమా తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికి తోడు సీనియర్ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా ప్రకటించడం, దాంట్లో వాణి విశ్వనాథ్ ను లీడ్ రోల్ చేయాలని కోరటంతో... ఎన్టీఆర్ పై సినిమాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

 

తాజాగా ఒకనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూడా ఈ వివాదం లోకి అడుగు పెట్టటంతో వ్యవహారం మరింత ఆసక్తిగా తయారయ్యింది. ఈ సినిమాల ప్రపోజల్ తో అటు టాలీవుడ్, ఇటు రాజకీయాలూ కలిసిపోయాయి. ఒక పక్క రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ'స్ ఎన్టీఆర్ అని ప్రకటించగానే. దానికి ఫైనాన్స్ వైఎసార్సీపీనుంచి మద్దతు వచ్చింది. వైసీపీ నేత రాకేష్ దీనికి నిర్మాత అని తెలియగానే... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో సినిమా అంటూ ప్రకటించాడు.

 

కేతిరెడ్డి తలపెట్టిన సినిమాపై లక్ష్మీ పార్వతి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు "లక్ష్మీస్ వీరగ్రంథం" చిత్రంలో నటించమని తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని, అయితే ఆ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, అయితే అన్నీ కుదిరితే ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వాణీ విశ్వనాథ్ చెప్పడంతో వివాదం మరింత ఆసక్తిగా మారింది.

 

ఇదంతా ఇలా వుంటే.. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కీ నటి వాణీ విశ్వనాథ్‌కీ ఉన్న పరిచయం గురించి ఆ తరం వాళ్లు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ వాణీ విశ్వనాథ్‌ను పెళ్లి చేసుకుందామనుకున్నారని అప్పట్లో పత్రికలు కోడై కూసాయి. ఎన్టీఆర్ ఒక దశలో వాణినే వివాహం చేసుకోవాలనుకున్నాన్నాడంటూ ఆరోజుల్లో వినిపించిన టాక్ ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. నైంటీస్ లో సామ్రాట్ అశోక సినిమా సమయంలో అధికారం లేకపోవడం... ఆ సమయంలో కుటుంబ సభ్యుల నిరాదరణతో ఒంటరి అయిన రామారావుకు, వాణికి మంచి ఫ్రెండ్ షిప్ అయ్యిందని అంటారు.

 

అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవాలనుకున్న వారి జాబితాలో వాణీ కూడా ఉందనేది 90లో పనిచేసిన సినీ పత్రికల కథనం. అయితే ఆ రోజుల్లో వున్న భావజాలాన్ని బట్టి.. ఈ వయసులో పెళ్ళా అంటూ ఆశ్చర్యంగా, కాస్త అదోరకంగా చూసినవాళ్ళు ఉన్నారు. నిజానికి లక్ష్మిపార్వతికి దగ్గర కావడానికి మునుపు వాణీ విశ్వనాథ్, మీనాక్షి శేషాద్రి వంటి తనతో పని చేసిన హీరోయిన్లను కూడా ఎన్టీఆర్ పరిగణనలోకి తీసుకున్నాడని నాటి విశ్లేషకులు చెబుతారు.

 

ఎన్టీఆర్ తో కలిసి నటించిన సమయంలో ఆమెను ఆయన అమితంగా అభిమానించాడని వాణీయే స్వయంగా ఒకసారి ఒక తెలుగు మీడియాతో చెప్పుకొచ్చింది. నాడు నందమూరి తారక రామారావు గారికీ తనకూ మధ్య ఉన్న సాన్నిహిత్యం వుండేదని.. ఆ పరిచయాన్ని గురించి స్వయంగా తనే చెప్పింది. సామ్రాట్ అశోక సినిమా పూర్తి అయ్యాకా.. ఎన్టీఆర్ నన్ను ఇంటికి ఆహ్వానించారని, అదనంగా నా చేతిలో కొంత డబ్బు పెట్టి పంపించారని..' వాణీ విశ్వనాథ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

 

ఎన్టీఆర్ వారసులకు ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేనందున.. వాణీని, మీనాక్షిని గట్టిగా హెచ్చరించారని.. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా వాళ్లు అలాగే వ్యవహరించినందునే.. ఎన్టీఆర్ ఒక పబ్లిక్ మీటింగులోనే ఆమెతో వివాహం విషయాన్ని ప్రకటించాడని అంటారు. మరి ఇప్పుడు లక్ష్మీస్ వీరగ్రంథంలో వాణి విశ్వనాథ్ ఎన్టీఆర్ సతీమణిగా నటిస్తుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా వాణి,ఎన్టీఆర్ ల రిలేషన్ పై వస్తున్న రూమర్స్ సంచలనం రేపుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios