నటి శ్రీదేవి లేరన్న విషయాన్ని చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి సంతాప సభలు నిర్వహించి ఆ నటి గొప్పతనాన్ని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. తాజాగా, ఓ అభిమాని ఆమె కోసం సంగీతం వాయిస్తూ రైలులో నివాళులర్పించాడు.ముంబైకి చెందిన బోరివలి లోకల్ రైలులో ప్రకాశ్ అనే వ్యక్తి ప్రయాణించాడు. చేతితో తయారు చేసిన సంగీత వాయిద్య పరికరం సారంగి అతని వద్ద ఉంది. శ్రీదేవి నటించిన నాటి చిత్రం ‘చాందినీ’ లోని ‘తేరే మేరే హోనోథో పర్ ..’ పాటను ఈ పరికరం ద్వారా వాయిస్తూ తన అభిమాన నటికి నివాళులర్పించాడు.
 

కాగా, ఇదే రైల్ లో ప్రయాణిస్తున్న రచయిత వరుణ్ గ్రోవర్ ఈ దృశ్యాన్ని చిత్రీకరించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నిన్న రాత్రి  ప్రయాణికులతో నిండిపోయిన బోరివలి లోకల్ రైలులో హ్యాండ్-మేడ్ సారంగి తో ఉన్న ప్రకాశ్ అనే వ్యక్తి ‘తేరే మేరే హోనోథో పర్..’  పాటను వాయించాడు. శ్రీదేవికి నివాళులర్పిస్తున్నాడనే విషయాన్ని ఈ బోగీలో ప్రయాణిస్తున్న మాలో చాలామంది తెలుసుకున్నారు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి’ అని వరుణ్ గ్రోవర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.