సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థల్లో దిల్ రాజు బ్యానర్ ఒకటి. తన సినిమాల విషయంలో దిల్ రాజు చాలా పక్కాగా ఉంటాడు. అతడి జడ్జిమెంట్ ఆధారంగానే సినిమాలు చేస్తుంటారు. తను నిర్మించే సినిమాల్లో దిల్ రాజు కెలుకుడు ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమా వేడుకల్లో అతడి ప్రసంగాల సంగతి సరేసరి. సినిమా ఏవరేజ్ అయినా.. దాన్ని హిట్ అంటూ గొప్పలు పోతాడు. అయితే ఈ మధ్యకాలంలో దిల్ రాజు వ్యవహారంలో కాస్త తేడా వచ్చిందనే చెప్పాలి. మిగిలిన అగ్ర నిర్మాణ సంస్థలను నడిపించే నిర్మాతలు అసలు స్టేజ్ మీదకే వెళ్లరు. వెళ్లినా తమ పరిధిలో మాట్లాడేసి వచ్చేస్తారు.

కానీ దిల్ రాజు స్టేజ్ మీద చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ మాత్రమే చేయాలి. కానీ తన హీరోలను తక్కువ చేసి మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'లవర్' సినిమా రిలీజ్ టైమ్ లో రాజ్ తరుణ్ ను ఎంత తక్కువ చేసి మాట్లాడాడో తెలిసిందే. రాజ్ తరుణ్ కి అంత సీన్ లేకపోయినా.. భారీగా ఇన్వెస్ట్ చేశామని చెప్పాడు. మొన్నటికిమొన్న 'శ్రీనివాస కళ్యాణం' ఆడియో ఫంక్షన్ లో నితిన్ ను పట్టుకొని ఫ్లాపుల్లో ఉన్నాను, ఆదుకోమని ఇంటికి వచ్చి అడిగాడని అందరిముందు అనేశాడు. డైరెక్టర్ సతీష్ వేగ్నేశకు తనే సినిమా ఐడియా ఇచ్చినట్లు ఇలా ఏదేదో మాట్లాడేశాడు.

స్టేజ్ మీద ఉన్నప్పుడు అందరూ ఆయన ముందు సైలెంట్ గా ఉన్నా.. వెనుక మాత్రం దిల్ రాజు ప్రవర్తనను విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. స్టేజ్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని దిల్ రాజు విషయంలో అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడి చేతిలో మహేష్ బాబు సినిమా తప్ప మరొకటి లేదు. అది కూడా సోలో ప్రొడక్షన్ కాదు. ఇలా అయనకు తోచింది మాట్లాడుకుంటూ పోతే హీరోలు, దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆలోచించే పరిస్థితి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.