కమల్ హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `థగ్ లైఫ్` సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ కమల్ గత మూవీ `భారతీయుడు 2`ని క్రాస్ చేయలేకపోయింది.
పలు వివాదాల అనంతరం కమల్ హాసన్ `థగ్ లైఫ్` సినిమా గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో శింబు ముఖ్య పాత్రలో నటించగా, త్రిష, అభిరామి కమల్‌కి జోడీగా చేశారు. అశోక్ సెల్వన్, నాజర్, తనకెళ్ల భరణి, మహేష్ మంజ్రేకర్ కీలకపాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.
కమల్ `థగ్ లైఫ్` చిత్రానికి మిశ్రమ స్పందన
భారీ అంచనాలతో గురువారం విడుదలైన `థగ్ లైఫ్` సినిమాకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమాలో కొన్ని మైనస్‌లు వినిపిస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ఎంచుకున్న కథ కొత్తగా లేదని,
ఆయన టేకింగ్ కూడా ఆకట్టుకునేలా లేదనే టాక్ వినిపిస్తుంది. కమల్ హాసన్ నటనతో మ్యాజిక్ చేసినప్పటికీ ఆ స్థాయిలో కథ, కథనాలు లేకపోవడంతో ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు.
ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన రెహ్మాన్ మ్యూజిక్
ఇంకోవైపు సినిమా చాలా స్లోగా ఉండటం, రెహ్మాన్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం కూడా మైనస్‌గా చెబుతున్నారు. శింబు పాత్రని కూడా సరిగా వాడుకోలేదని, త్రిష పాత్రకి కూడా ప్రయారిటీ లేదనే విమర్శలు వచ్చాయి.
అంతేకాదు త్రిషని బాగా ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ మాత్రమే బలంగా నిలిచాయి. అవి మాత్రం ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
`థగ్ లైఫ్` మొదటి రోజు కలెక్షన్లు
మొత్తంగా మిశ్రమ స్పందన అందుకుంటోన్న `థగ్ లైఫ్` చిత్రం తొలి రోజు ఎంత వసూళ్లని రాబట్టిందనేది చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.18 కోట్లు వసూలు చేసిందట. రూ.15.4 కోట్లు తమిళనాడులో, రూ.1.5కోట్లు తెలుగులో, నార్త్ లో పది లక్షల వరకు మాత్రమే వచ్చాయి.
మలయాళంలోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో కోటికిపైగానే వచ్చినట్టు సమాచారం. కర్ణాటకలో సినిమా విడుదల కాలేదు. ఈ ప్రభావం సినిమాపై గట్టిగానే ఉండబోతుంది.
`భారతీయుడు 2`ని క్రాస్ చేయలేకపోయిన `థగ్ లైఫ్`
ఇక కమల్ కి `థగ్‌లైఫ్` పెద్ద షాకిచ్చింది. ఈమూవీ ఆయన గత చిత్రం `భారతీయుడు 2` ని కూడా దాటలేకపోయింది. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న `భారతీయుడు 2` మొదటి రోజు కలెక్షన్లని.. ఫస్ట్ డే మిశ్రమ స్పందన రాబట్టుకున్న `థగ్ లైఫ్` దాటలేకపోవడం గమనార్హం.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన `భారతీయుడు 2` ఫస్ట్ డే రూ.25కోట్లు వసూలు చేసింది. కానీ `థగ్ లైఫ్` రూ.18కోట్లకే పరిమితమయ్యింది. అయితే ఈ మూవీ ఆడితే శని, ఆదివారం వరకే, ఆ తర్వాత నిలబడటం కష్టమనే చెప్పాలి.
కాకపోతే మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో కొంత కలిసొచ్చే అంశం. మరి అది ఈ చిత్రానికి ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
