పవన్‌ కళ్యాణ్‌ అభినులు, సాధారణ ఆడియెన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'హరి హర వీర మల్లు' ఒకటి. ఈ సినిమా వాయిదా పడబోతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది. అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న `హరిహర వీరమల్లు` సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్‌పై అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. మరోసారి మూవీ వాయిదా పడుతుందనే టాక్‌ వినిపిస్తుంది.

 `ఏషియానెట్ తెలుగు` కూడా ఇదే విషయాన్ని తెలిపింది. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. `హరిహర వీరమల్లు` మూవీ జూన్‌ 12న విడుదల కావడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 

`హరిహర వీరమల్లు` వాయిదా కన్ఫమ్‌ చేసిన నిర్మాతలు

 `హరిహర వీరమల్లు` సినిమా కోసం అభిమానులు, ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారని, ఇన్నాళ్లపాటు ఎంతో సహనంతో ఉన్నారని, సినిమాకి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చారని అందుకు వారందరికి నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఈ విషయం చెప్పడానికి బాధగా ఉందని, కానీ తప్పడం లేదని, ఈ నెల 12న `హరిహర వీరమల్లు` సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కొత్త రిలీజ్‌ డేట్‌ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

`హరిహర వీరమల్లు` వాయిదాకు కారణాలు

ఈ సందర్భంగా `హరిహర వీరమల్లు` సినిమా మరోసారి వాయిదా పడటానికి కారణాలు చెప్పారు నిర్మాతలు. `గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేశారు.

`కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము` అని తెలిపారు నిర్మాతలు.

`హరిహర వీరమల్లు` సినిమాపై నెగటివ్‌ ప్రచారం.. నిర్మాతలు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో 'హరి హర వీరమల్లు' చిత్రం గురించి తప్పుడు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. `చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దు.వాటిని వ్యాప్తి చేయవద్దు. దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్‌ డేట్లని ఫాలో అవ్వండి. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని భావించకండి` అని తెలిపారు `హరిహర వీరమల్లు` నిర్మాతలు. 

గొప్పగా `హరిహర వీరమల్లు` ఫైనల్‌ ఔట్‌పుట్‌

సినిమా గురించి నిర్మాతలు చెబుతూ, `'హరి హర వీరమల్లు' చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు.

ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ, అంతకంటే గొప్పది ఏదో రూపుదిద్దుకుంటుందని కూడా ఇది సూచిస్తుంది. ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ తో ముందుకు సాగుతోంది.

'హరి హర వీరమల్లు' థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ట్రైలర్‌తో పాటు, కొత్త విడుదల తేదీని కూడా తెలియజేస్తాం` అని పేర్కొన్నారు. 

`హరిహర వీరమల్లు` టెక్నీకల్‌ టీమ్‌ గురించి 

ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అటు విజువల్ పరంగానూ, ఇటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించనుందని టీమ్ తెలిపింది.

జ్ఞాన శేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిభగల సాంకేతిక బృందం మద్దతుతో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని టీమ్‌ తెలిపింది.

మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. ఎం. రత్నం చిత్ర సమర్పకులు గా, ఎ. దయాకర్ రావు నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోందని నిర్మాతలు వెల్లడించడం విశేషం.