లక్ష్యం సాధించాలనే తపన వుంటే... కఠోర శ్రమ తోడైతే... ఎంతటి ఉన్నత లక్ష్యమైనా సాధించొచ్చనటానికి నిదర్శనంగా నిలిచాడు మరో మట్టిలో మాణిక్యం. కర్నూలుకు చెందిన సుధీర్ ఆర్థిక పరిస్తితి సహకరించకున్నా అద్భుతాలు సాధించాడు. టార్గెట్ సెట్ చేసుకున్నాడు. గోల్ కొట్టేశాడు. లక్ష్యం చిన్నది కాకున్నా, కుటుంబ నేఫథ్యం అంత గొప్పది కూడా కాకున్నా కానీ లక్ష్యం సాధించాలన్న తపనతో కఠోర శ్రమకోర్చి బాడీ బిల్డర్ గా ఇంటర్నేషనల్ లెవల్ కు ఎదిగాడు. మెడల్స్ సాధించి సత్తా చాటాడు.

ఆర్టీసీ మెకానిక్ కడుపున పుట్టిన సుధీర్... గమ్యం చేరేందుకు ఎన్నో ఒడిదుడుకులు దాటాడు. అవమానాలు,  అవహేళనలు.. జాబ్ చేసుకోక ఇదంతా అవసరమా అని కామెంట్స్.. ఇలా అన్నీ భరించి బాడీ బిల్డింగ్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు. బాడీ బిల్డింగ్ పట్ల తనకున్న చిత్తశుద్ధితో సక్సెస్ అయ్యాడు.

బిటెక్ చదివే రోజుల్లోనే బాడీ బిల్డింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్న సుధీర్.. అమెరికన్ బాడీబిల్డర్ రోనీ కోల్ మన్ ను ఆదర్శంగా తీసుకుని సాదాసీదా ఆహారంతోనే తన శరీరాన్ని బాడీబిల్డర్ బాడీ స్థాయికి మార్చుకున్నాడు. కాలేజీలోనే జిమ్ ట్రైనర్ గా మారాడు. తన గురువు కృష్ణ చైతన్య సలహాతో ఆస్ట్రేలియాకు చెందిన బాడీబిల్డింగ్ ట్రెయినర్ నుంచి ఆన్ లైన్ ట్రెయినింగ్ తీసుకున్నాడు.

2015లో అనంత పురంలో జరిగిన రాయలసీమ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. రాజమండ్రిలో జరిగిన మిస్టర్ ఆంధ్రా పోటీల్లో సిల్వర్ సాధించాడు. అంతేకాక రాష్ట్ర స్ఠాయిలో 5 బంగారు, 9 వెండి పతకాలు సాధించాడు. ఈ యేడాది పంజాబ్ లుథియానాలో జరిగిన ఇంటర్నేషనల్ బాడీబిల్డింగ్ పోటీలో సిల్వర్, బ్రాంజ్(ఫిజిక్) మెడల్స్ సాధించాడు. మిస్టర్ ఇండియా, మిస్టర్ ఏసియా, మిస్టర్ వరల్డ్  పోటీల్లో పాల్గొని మెడల్ సాధించాలన్న తపనతో ముందుకు సాగుతున్నాడు. 
ఇంటర్నేషనల్ లెవెల్ కు ఎదిగిన సుధీర్ ఎదుగుదలకు అమ్మ పొదుపులక్ష్మి డబ్బు, నాన్న సాలరీ, తన సాలరీ అన్నీ కలిపి వాడుతున్నాను. ప్రభుత్వం సహకారం అందిస్తే డైట్ మెయింటెన్ చేయటం సులువవుతుందని సుధీర్ ఫ్యామిలీ కోరుతున్నారు. 
బాడీ బిల్డింగ్ పోటీల ప్రిపరేషన్ కే ప్రాణమిస్తున్న సుధీర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన భార్య అపర్ణ కూడా తనకు లక్ష్యం సాధన దిశగా ఎంతో సహకారం అందిస్తోంది. తాను సుధీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గర్వంగా వుందని... అత్త, మామలతో పాటు తాను కూడా తన వంతుగా సహకారం అందిస్తున్నానని, ప్రభుత్వం ముందుకొచ్చి ప్రోత్సహిస్తే.. సుధీర్ అద్భుతాలు సాధించగలడంటోంది అపర్ణ.