ఏపీ సీఎం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్తే మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదనటం ఒక తెలుగు వాడిగా నా ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంలో నా ఆత్మగౌరవమే కాదు ప్రతి తెలుగోడి ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. ఒకవేళ మోదీ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినా.. చంద్రబాబు ఆ మాట చెప్పడం తప్పు అన్నారు. ఇది ఎంత దారుణం. దీన్ని ఎవరైనా చెప్పుకుంటారా? అన్నారు. నిజంగా చంద్రబాబుకి ఆత్మగౌరవం ఉండి ఉంటే ఒకసారి రెండుసార్లు చూసి అప్పుడే మొత్తానికి బయటకు వచ్చేయాలి. 

 


ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రధాని వద్దకు వెళితే అపాయింట్‌మెంట్ ఇవ్వారా? 29 సార్లు నా ముఖ్యమంత్రి వెళితే పట్టించుకోరా? ఎవడండీ ప్రధాన మంత్రి.. సీఎంని లోపలికి రానీయకుండా ఉండటానికి? వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రధాన మంత్రి ఎంత గొప్పోడైనా కావచ్చు. ఇలా చేస్తారా? 

 

సంవత్సరన్నర పాటు మా ముఖ్యమంత్రిని లోపలికి రానీయకుండా చేశారంటే.. ఆ ముఖ్యమంత్రిని నేను ఓటేసి గెలిపించుకున్నా.. అతన్ని అవమానించారంటే మమ్మల్ని అవమానించినట్టే. మాకు ఈ అవమానానికి నువ్ ఏం సమాధానం చెప్తావ్ అంటూ ప్రధానిని ప్రశ్నించారు తమ్మారెడ్డి. అయితే అలాంటి దారుణమైన పరిస్థితుల్లో టీడీపీ ఎన్డీయే పార్టీని ఎందుకు వదిలేయలేదని తాను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారన్నారు తమ్మారెడ్డి.