Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో సత్తా చాటుతున్న తెలంగాణ హీరోలు..కానీ..

  • తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగి టాలీవుడ్ లో సత్తా చాటుతున్న హీరోలు
  • రీసెంట్ గా అర్జున్ రెడ్డి హిట్ తో కొత్త చర్చకు తెరలేపిన విజయ్ దేవరకొండ
  • సత్తా చాటుతూ నితిన్ తర్వాత ప్రత్యేక గుర్తింపు సాధించిన నిఖిల్, విజయ్ దేవరకొండ
  • తెలంగాణ యాసకు తెలుగు సినిమాల్లో పెరిగిన గౌరవం
telangana born heroes rocking in telugu film industry hats off to viewers

మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు సినిమా వాటా అంటే కేవలం ఇక్కడి యాస, భాషను కించపరచడమే వుండేది. కేవలం కమెడియన్ లకు, విలన్ లకు మాత్రమే తెలంగాణ యాసలో డైలాగులు, పాత్రలు డిజైన్ చేసేవారు. దీనికి కారణం ప్రధానంగా ఫిల్మ్ మేకర్స్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నత స్థానాల్లో లేకపోవడమేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ఉద్యమ కాలంలో తెలంగాణ వాసుల వాటా ఏంటంటూ సినీ పరిశ్రమ పెద్దలపై పోరాటాలు చేసిన చరిత్ర వున్న ఉద్యమకారులు విజయం సాధించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది.

 

 

రాష్ట్రం ఏర్పడ్డాక సినీ పరిశ్రమ అంతా కొందరు ఆంధ్ర పెద్దల గుప్పిట్లో వుంది కాబట్టి పరిశ్రమ సాంతం తరలి వెళ్తుందనే అపోహలు కలిగించారు కొందరు గిట్టనివాళ్లు. కానీ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే వుండాలని, ఇక్కడే మరింత అభివృద్ధి చెందేలా అన్ని రకాలుగా అండదండలు అందిస్తామని హామీ ఇచ్చిన కొత్త సర్కారు ఆ దిశగా శక్తివంచన లేకుండా పనిచేసి ఫలితాలు సాధిస్తున్నారు.

 

 

ఆ కోవలోనే అపోహలన్నీ తొలగిపోయి సినీ పరిశ్రమకు ఇక్కడి సర్కారు అండదండలు వుంటాయనే నమ్మకం కలిగించడంలో తెలంగాణ సర్కారు, ప్రజలు, సబ్బండ వర్ణాలు సఫలమై టాలీవుడ్ దినదిన ప్రవర్థమానంగా వెలిగిపోతోంది. ఇలాంటి ప్రోత్సాహకర వాతావరణంలోనే రాష్ట్రం విడిపోయాక వచ్చిన సినిమాలు ఖండాంతరాల ఖ్యాతిని దక్కించుకుంటూ.. నైజాం ఏరియాలో కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు కొల్లగొడుతున్నాయి. ఇంకా కొల్లగొడుతూనే వుంటాయని అనడంలో సందేహం ఏ మాత్రం అవసరం లేదు.

 

 

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ గడ్డపై పుట్టిన టాలెంటెడ్ హీరోలు కూడా తమదైన శైలితో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. కళకు ప్రాంతం లేదని.. వినూత్నంగా సినిమాలు తీస్తే.. ప్రాంతీయ బేధం లేకుండా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు నిరూపించిన తరుణమిది. దీనికి ఇటీవల సెన్సార్ ఏ సర్టిఫికెట్ తో విడుదలైనా.. కలెక్షన్స్ పరంగా సత్తా చాటిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చక్కటి ఉదాహరణ. తెలంగాణ ప్రాంత యాస, భాషలతో పూర్తిగా ఓ కొత్త కోణంలో తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి ఓ కొత్త ఒరవడికి నాంది పలికాడని చెప్పాలి. అందుకే ఆంధ్ర, తెలంగాణ అని తేడా లేకుండా.. దర్శకధీరుడు రాజమౌళి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి గొప్ప దర్శకులేకాక.. హీరోలు రానా, నాని, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు, స్టార్ హిరోయిన్ సమంత లాంటి వాళ్లు పొగడ్తలతో ముంచెత్తారు.

 

దీన్ని బట్టే ప్రస్థుతం తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి వాతావరణం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ పుట్టిపెరిగిన హీరోలకు అవకాశాలు కూడా మెరుగుపడటమే కాక లీడ్ రోల్స్ కూడా తెలంగాణ హీరోలు పుట్టుకొచ్చారు. అప్పటి వరకు తెలుగు వెండితెరపై ఊహకు కూడా అందని తెలంగాణ హీరోలు.. ఇక్కడి, యాస-భాష, నేపథ్యం వున్న సినిమాల్లో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇది శుభపరిణామం. తెలుగు ప్రజలు మంచిని స్వగతిస్తారని నిరూపిస్తున్న అద్భుతమైన ఈ తరుణంలో తెలంగాణ హీరోల ప్రస్తావన ఇక్కడ అవసరం.

 

తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి సినీ పరిశ్రమలో తనకూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో నితిన్. తేజ జయం సినిమాతో ప్రారంభమై ఇటీవల లై చిత్రం వరకు నితిన్ ప్రస్థానం అద్భుతం. ఇప్పుడు అదే కోవలో విజయ్ దేవరకొండ. తెలంగాణకే చెందిన దర్శకుడు తరుణ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిచూపులు సక్సెస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకుని.. తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన విజయ్ దేవరకొండ తెలంగాణ నుంచి వచ్చి స్టార్ హీరోగా మారిపోయాడు. వర్మ లాంటి సంచలన దర్శకుడే తెలంగాణ మెగా స్టార్ అంటూ విజయ్ దేవరకొండ గురించి కమెంట్ చేయడం నిజంగా ప్రశంసనీయం. అదే నిజం. దీన్ని బట్టే మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో తెలంగాణ హీరోల ఉద్భవం ఎలా సాగుతోందో చెప్పొచ్చు. ఇక ఒక రకంగా నేచురల్ స్టార్ నాని కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు. అలా వీళ్లంతా ఆంధ్రా ప్రాంతంలో పుట్టి పెరిగిన స్టార్ హీరోల అవకాశాలను వీలైనంతగా తమవైపు లాగేసుకుంటూ దూసుకెళ్తున్నారు.

 

ఓ మూడేళ్ల క్రితం వరకు కూడా ఇలాంటి వాతావరణం తెలుగు పరిశ్రమలో కనిపించేది కాదు. కనీసం ఊహకు కూడా అందని విషయం. కానీ కొత్త రాష్ట్రం-కొత్త ఆశయాలు.. ఈ హీరోలు ఉన్నత స్థానాలకు చేరేందుకు దోహదం చేస్తున్నాయని అనిపిస్తోంది.

 

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి కత్తి కాంతారావు స్టార్ హీరోగా ఎదిగినా... గతంలో తెలంగాణ సినిమా అంటే కేవలం కళాత్మకంగా తీసినవో, అవార్డుల కోసం తీసినవో, లేక విప్లవాత్మకంగా తెరకెక్కించినవో అన్నట్లుగా వేరుచేస్తూ భావన వుండేది. కానీ ఇప్పుడు ఆ ధోరణి మారిందని, తెలంగాణ స్టార్స్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో తమ వాటా దక్కించుకుంటున్నారని సినీ రంగంలో గుర్తింపు పొందిన తెలంగాణ ప్రాంత దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.

 

వరంగల్ కు చెందిన నిర్మాత రాజ్ కందుకూరి పెళ్లి చూపులు సినిమాతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా కించపరచబడిన యాసకు గౌరవం కల్పించి నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకున్న సినిమా పెళ్లి చూపులు. తెలంగాణ యాసలో ఉండే గొప్పదనాన్ని సినిమాలో చూపిన తీరుకు,, ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అన్న ప్రాంతీయ బేధం లేకుండా తెలుగు ప్రేక్షకులు అంతా బ్రహ్మరథం పట్టారు. ఇక ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రం.. తెలంగాణ యాసకున్న ఆ లెగసీని మరింత ముందుకు తీసుకెళ్లిందని చెప్పకతప్పదు. ఫిదాలో సాయిపల్లవి తెలంగాణ యాసను ఆంధ్రా ప్రాంత వాసులే ఎక్కువ ఎంజాయ్ చేసారనటానికి అక్కడ ఫిదా సాధించిన కలెక్షన్సే సాక్ష్యం.

 

ఇక నితిన్ తర్వాత హ్యాపీ డేస్ తో గుర్తింపు సాధించి... స్వామి రారా, కేశవ లాంటి రీసెంట్ హిట్స్ తో నిఖిల్ తనకంటూ స్పేస్ ఏర్పరుచుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకుని తెలంగాణ నుంచి వచ్చిన స్టార్ హీరోలుగా దూసుకెళ్తున్నారు. అయితే సాధించిన విజయాల ఆదర్శంగా... తెలుగు సినిమాల్లో తెలంగాణ నుంచి రావాల్సింది ఇంకా చాలా వుంది. మొత్తానికి సినిమాను సినిమాగానే చూస్తూ ప్రపంచంలో ఎక్కడున్నా... ప్రాంతం, యాస భాషతో సంబంధం లేకుండా తెలుగు సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులను అభినందించాల్సిందే. చివరగా ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో తెలంగాణ వైవిధ్యం కేవలం 5శాతం మాత్రమే తెరకెక్కిందని, 95 శాతం అలాగే మిగిలి వుందని, అదంతా వెండితెరకెక్కి.. తెలుగు సినీ ప్రేక్షకుల నీరాజనాలు అందుకోవాలని ఆశిద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios