రివ్యూ: తేజ్ ఐ లవ్ యూ

tej i love you movie telugu review
Highlights

కరుణాకరన్‌ గురించి చెప్పుకుంటే ఇప్పటికీ అతని తొలి చిత్రం 'తొలిప్రేమ' గుర్తుకొస్తుంది. దశాబ్ధంన్నర క్రితం చేసిన ఆ సినిమా రేంజ్‌ అద్భుతాన్ని మళ్లీ అతను ఎప్పుడూ చేయలేకపోయాడు. డార్లింగ్‌, ఉల్లాసంగా ఉత్సాహంగాతో మెప్పించినా కరుణాకరన్‌ ఎక్కువసార్లు డిజప్పాయింట్‌ చేస్తున్నాడు

నటీనటులు : సాయి ధరం తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్రా లోకేష్ తదితరులు 
సంగీతం: గోపిసుందర్ 
సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ
నిర్మాత: కె.ఎస్.రామారావు 
దర్శకత్వం: కరుణాకరన్ 

దర్శకుడు కరుణాకరన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్. ఆయన సినిమాలు రూపొందించే సమయంలో దర్శకులందరూ కమర్షియల్ సినిమాలు చేస్తుంటే కరుణాకరన్ మాత్రం తనదైన స్టైల్లో ప్రేమ కథలు తెరకెక్కించి యువతను ఆకట్టుకునేవాడు. 'డార్లింగ్' సినిమా తరువాత ఇప్పటివరకు ఆ రేంజ్లో సక్సెస్ అందుకోలేకపోయాడు గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. ఈసారి మెగాహీరో సాయి ధరం తేజ్ హీరోగా 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమాను రూపొందించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
తేజ్(సాయి ధరం తేజ్) చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకోవడంతో పెదనాన్న, పెద్దమ్మల వద్ద పెరుగుతుంటాడు. తేజ్ ఉమ్మడి కుటుంబంలో పెరుగుతాడు. తేజ్ కు పదేళ్ల వయసులో ఒక మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేయబోతే వారి నుండి ఆమెను కాపాడడానికి ఒకరిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి ఏడేళ్ల పాటు జైలులో పెడతారు. తేజ్ కు చిన్నప్పటి నుండి సంగీతం అంటే ఇష్టం. అలా పెరిగిన తరువాత మ్యూజిక్ ట్రూప్ పెట్టుకొని రన్ చేస్తుంటాడు. పెద్ద ఫ్యామిలీ, నచ్చే పని ఇలా సాఫీగా సాగిపోతున్న అతడి లైఫ్ లోకి నందిని(అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. లండన్ నుండి ఇండియాకు వచ్చిన నందినిని చూసిన వెంటనే ప్రేమిస్తాడు తేజ్. కొద్దిరోజులకు నందిని తన అవసరం కోసం తేజ్ తో కలిసి తిరగాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఆ సమయంలో తేజ్ ఆమెను ప్రేమిస్తున్నట్లు చెబుతాడు. నందినికి కూడా తేజ్ అంటే ఇష్టమే.. ఆ విషయాన్ని అతడి చెబుతామని బయలుదేరుతుంది. ఇంతలో ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. ఈ కారణంగా బ్రెయిన్లో కొన్ని టిష్యూలు దెబ్బ తినడంతో ఆమె తేజ్ను కలిసిన సంగతి ప్రేమించిన విషయం, అసలు ఆమె ఇండియాకు ఎందుకు వచ్చిందనే విషయాలను మర్చిపోతుంది. తన తండ్రితో కలిసి తిరిగి లండన్ వెళ్లడానికి రెడీ అవుతుంది. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..? నందిని లండన్ వెళ్లిపోతుందా..? అసలు ఆమె ఇండియా రావడానికి గల కారణాలు ఏంటి..? తేజ్ తనను ప్రేమించిన సంగతి నందినికి తెలుస్తుందా..? చివరికి వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
హీరో, హీరోయిన్ల మధ్య గొడవతో సినిమా మొదలుపెట్టడం దర్శకుడు కరుణాకరన్ ట్రేడ్ మార్క్ అనే చెప్పాలి. ఈ సినిమాలో కూడా తన మార్క్ ని విడిచిపెట్టకుండా కేవలం వినోదంతోనే ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. దాదాపు చాలా సినిమాలలో చూసే సన్నివేశాలే అయినప్పటికీ తనస్టైల్ లో మరోసారి వాటిని తెరకెక్కించాడు. హీరోగారి ఫ్యామిలీ, ఓ సాంగ్.. ఫ్యామిలీలో హీరో చేసిన ఓ తప్పు కారణంగా అతడిని ఇంటి నుండి గెంటేయడం వంటి సన్నివేశాలు 'రెడీ' మూవీ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ను తలపిస్తాయి. ఇక హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ ఆడియన్స్ ను విసిగిస్తుంది. ముఖ్యంగా నందిని క్యారెక్టర్ అగ్రిమెంట్ అంటూ హీరోని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అసహనానికి గురి చేస్తాయి. బోర్ కొట్టించే సన్నివేశాల తరువాత ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఇంటర్వెల్ దగ్గర ఇచ్చిన ట్విస్ట్ తరువాత సినిమాను ఊహించేయడం పెద్ద విషయమేమీ కాదు. అందుకేనేమో సెకండ్ హాఫ్ మొదలుకాగానే సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది.

హీరోయిన్ కు గతం గుర్తు చేయడం కోసం హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే విన్యాసాలు నవ్వు తెప్పించకపోగా.. మరింత విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఫ్యామిలీను హీరో లవ్ కోసం సెకండ్ హాఫ్ లో మరోసారి టచ్ చేశారు. ఇక హీరోయిన్ తన ప్రేమను గ్రహించి హీరోకి దగ్గరయ్యే సమయంలో చిన్న సెంటిమెంట్ ను యాడ్ చేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్ ను ఎయిర్ పోర్ట్ లో ప్లాన్ చేస్తూ.. రొటీన్ గానే హీరోయిన్ వచ్చి హీరోని హగ్ చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఏ ఒక్క సీన్ లో కూడా కొత్తదనం కనిపించదు. ముఖ్యంగా కథ, కథనాల్లో నవ్యత లోపించింది. సినిమా చూసిన తరువాత ఇంకా కరుణాకరన్ 'ఎందుకంటే ప్రేమంట' దగ్గరే ఉండిపోయాడనిపిస్తుంది. కరుణాకరన్ సినిమాలలో ఇప్పటివరకు ఇలాంటి మీనింగ్ లెస్ లవ్ ట్రాక్ ను చూసి ఉండరు. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా.. డైరెక్టర్ కరుణాకరన్ కాబట్టి లవ్ స్టోరీ బావుంటుందేమో అని ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లే సాహసం చేస్తున్నారు. కానీ ఈ సినిమాతో వారి నమ్మకాన్ని మరింత పోగొట్టుకున్నాడు.

తన సినిమాలలో హీరోయిన్లను అందంగా చూపిస్తుంటాడు. ఈ సినిమాలో కూడా అనుపమను అందంగానే చూపించారు. టిపికల్ కరుణాకరన్ హీరోయిన్లు వైట్ డ్రెస్ లో ఎంట్రీ ఇస్తారు. అనుపమ కూడా అలానే కనిపించి మెప్పించింది. ఆమె కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకుంటాయి. కానీ కొన్ని చోట్ల ఆమె అతి చేసిందనిపిస్తుంది. తిక్క సినిమా నుండి వరుసగా ఐదు సినిమాలు ఫ్లాప్ లు అందుకున్న తేజ్ కు ఈ సినిమా రిజల్ట్ చాలా ముఖ్యం. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. కానీ సరైన కథ పడకపోవడంతో తనకు మరోసారి నిరాశే మిగిలింది. కానీ పెర్ఫార్మన్స్ పరంగా తేజ్ కు వంక పెట్టలేం. అయితే సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ లో తేజ్ మరింత పరిణితి చెందాల్సివుంది. హర్షతో చేయించిన కామెడీ ఒకట్రెండు చోట్ల నవ్విస్తుంది. సీనియర్ ఆర్టిస్టులు అంతా తమ నటనతో మెప్పించారు.

సాంకేతికంగా ఈ సినిమాను క్వాలిటీతో రూపొందించారు. ఆండ్రూ తన సినిమాటోగ్రఫీతో సినిమా స్థాయిని పెంచాడు. కలర్ ఫుల్ విజువల్స్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. ఎడిటర్ ఎంత కష్టపడినా.. వీలైనంత క్రిస్ప్ గా ఉంచాలని తనవంతు కృషి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సంగీతం చెప్పుకునే స్థాయిలో లేదు. నేపధ్యసంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది.  నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. కరుణాకరన్‌ గురించి చెప్పుకుంటే ఇప్పటికీ అతని తొలి చిత్రం 'తొలిప్రేమ' గుర్తుకొస్తుంది. దశాబ్ధంన్నర క్రితం చేసిన ఆ సినిమా రేంజ్‌ అద్భుతాన్ని మళ్లీ అతను ఎప్పుడూ చేయలేకపోయాడు. డార్లింగ్‌, ఉల్లాసంగా ఉత్సాహంగాతో మెప్పించినా కరుణాకరన్‌ ఎక్కువసార్లు డిజప్పాయింట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అతను తీసిన బ్యాడ్‌ ఫిలింస్‌ లిస్ట్‌లోకే చేరుతుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలని అనుకొని, ఎంటర్టైన్మెంట్ కోరుకొని ఈ సినిమాకు వెళ్తే గనుక ప్రేక్షకులకు నిరాశ తప్పదు. 

రేటింగ్: 2/5 

loader