ధనుష్ తెలుగులో నటించిన రెండవ చిత్రం కుబేర నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర సందడి థియేటర్లలో మొదలైంది. ఈ సందర్భంగా ధనుష్ గురించి అనేక ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మల్టీ ట్యాలెంటెడ్ నటుడు ధనుష్ 

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మల్టీ ట్యాలెంట్ ఉన్న అతి కొద్ది మంది నటుల్లో ధనుష్ ఒకరు. ధనుష్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా రాణిస్తున్నారు. ధనుష్ కమర్షియల్ చిత్రాల్లో రాణిస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న అనేక అద్భుతమైన చిత్రాలు చేశారు. తన విలక్షణ నటనతో ధనుష్ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు

ధనుష్ తెలుగులో నటించిన రెండవ చిత్రం కుబేర నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర సందడి థియేటర్లలో మొదలైంది. ఈ సందర్భంగా ధనుష్ గురించి అనేక ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఓ ఇంటర్వ్యూలో ధనుష్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ధనుష్ కి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది 

తనికెళ్ల భరణి మాట్లాడుతూ రజనీకాంత్ అల్లుడు(ఐశ్వర్యతో విడిపోక ముందు) ఉన్నాడు కదా ధనుష్ అతడు నాకంటే చిన్నవాడైనప్పటికీ చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ధనుష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లోకి వెళ్లినా అతడికి 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు. కానీ తన సొంత సంపాదన మీదే దృష్టి పెట్టకుండా.. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. నిర్మాతగా రెండు కోట్ల బడ్జెట్ లో చాలా చిత్రాలను నిర్మించాడు.

దాదాపుగా అన్ని చిత్రాలకు 10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కొన్ని చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ధనుష్ చేస్తున్నది ఎంత మంచి పనో చూడండి. తన పని తాను చేసుకోవడం మాత్రమే కాదు.. వేరే వాళ్లకు అవకాశాలు వచ్చేలా ధనుష్ ఆలోచిస్తున్నాడు. టాలెంట్ ఉన్న దర్శకులు, నటులు చాలామంది ఖాళీగా ఉన్నారు. అలాంటి వాళ్లందరికీ ధనుష్ అవకాశం కల్పిస్తున్నాడు అని తనికెళ్ల భరణి అన్నారు.

అలాంటి చిత్రాలు కొత్తవాళ్లతో చేయాలి 

కొన్ని కళాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు స్టార్ హీరోలు చేస్తే వర్కౌట్ కావు. ఎందుకంటే స్టార్ హీరోల నుంచి అభిమానులు కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశిస్తారు. చిరంజీవి లాంటి హీరోలకు కూడా మంచి సందేశాత్మక చిత్రం చేయాలని ఉంటుంది. కానీ రిస్క్ ఎందుకులే అని వెనక్కి తగ్గుతారు. అలాంటి చిత్రాలని కొత్త వాళ్ళతో తక్కువ బడ్జెట్ లో పెట్టి తీస్తే అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. ధనుష్ చేస్తున్నది అదే అని తనికెళ్ల భరణి ప్రశంసలు కురిపించారు.

ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్నప్పుడు, కమర్షియల్ గా అది వర్కౌట్ కాదు అని సందేహం ఉన్నప్పుడు.. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ లో ఆ చిత్రాన్ని నిర్మించాలి. దీనివల్ల కథ జనాల్లోకి వెళ్లడం మాత్రమే కాదు.. కొత్త వాళ్లకు అవకాశం కూడా వస్తుంది అని తనికెళ్ల భరణి అన్నారు.

నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో.. 

ధనుష్ చివరగా తన స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే చిత్రంలో నటించారు. తెలుగులో ధనుష్ నటించిన తొలి చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మంచి విజయం సాధించింది. ధనుష్ రెండోసారి తెలుగులో నటిస్తున్న చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.

సమాజంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాల నేపథ్యంలో శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ఎంగేజింగ్ గా అనిపించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. చిత్రాన్ని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ధనుష్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

వరుస పాన్ ఇండియా చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుంటున్న హీరోయిన్ రష్మిక సెంటిమెంట్ కూడా ఈ చిత్రానికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి పాన్ ఇండియా చిత్రాలతో రష్మిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.

శేఖర్ కమ్ముల హిట్ చిత్రాలు 

ఇక శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెరకెక్కించిన ఆనంద్ చిత్రం ఆయనకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. శేఖర్ కమ్ముల కెరీర్ లో కీలక చిత్రాలని ఒకసారి చూద్దాం.

ఆనంద్ (2004):శేఖర్ కమ్ముల కెరీర్‌ని నిలబెట్టిన తొలి హిట్ చిత్రం ఇదే. క్లాస్ ఆడియన్స్‌ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.

గోదావరి (2006):కమలినీ ముఖర్జీ, సుమంత్ జంటగా నటించిన ఈ చిత్రం గోదావరి అందాలని చూపిస్తూ మంచి విజయం సాధించింది.

హ్యాపీ డేస్ (2007):కాలేజ్ నేపథ్యంలో వచ్చిన బెస్ట్ యూత్ ఫుల్ చిత్రాలలో ఇది ఒకటి. కాలేజ్‌ డేస్‌, ఫ్రెండ్షిప్‌, ఫస్ట్ లవ్ వంటి అంశాలను అద్భుతంగా చూపించడంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. చిన్న బడ్జెట్ సినిమాగా రూపొందినా భారీ విజయాన్ని అందుకుంది. ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ లాంటి వారు నటించారు.

లీడర్ (2010):రానా దగ్గుబాటి నటించిన ఈ పొలిటికల్ డ్రామా చిత్రం, యువతలో నాయకత్వంపై చర్చను రేకెత్తించింది. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో సీఎం పాత్రలో అద్భుతంగా నటించారు. సుబ్బరాజ్, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు.

ఫిదా (2017): వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్. తెలంగాణ పల్లెటూరి అమ్మాయి, US‌లో పెరిగిన అబ్బాయి మధ్య ప్రేమకథను ఎంతో అద్భుతంగా మలచిన శేఖర్ కమ్ముల స్టైల్‌కు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు.

రాజమౌళి కామెంట్స్ 

శేఖర్ కమ్ముల ఈసారి ఫ్యామిలీ, లవ్ డ్రామాని పక్కన పెట్టి సమాజంలో ఉన్న అసమానతలని ఎత్తి చూపే కథాంశంతో కుబేర చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు. ఏం జరిగినా, ఎన్ని కష్టాలు ఎదురైనా శేఖర్ కమ్ముల తన విలువలని దాటి సినిమా చేయరు అని రాజమౌళి అన్నారు. ధనుష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నేను సినిమా చేస్తున్నాను అని చెప్పగానే.. తెలిసినవాళ్లంతా శేఖర్ సార్ తో సినిమా చేస్తున్నావా.. వావ్ ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్ అని అన్నారు. నేను కూడా చాలా ఎక్కువగా ఊహించుకున్నా.. కానీ షూటింగ్ కి వెళితే నన్ను బిచ్చగాడిని చేసేశారు.. తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో నిలబెట్టారు అంటూ ధనుష్ వేదికపై సరదాగా కామెంట్స్ చేశారు.