రంగస్థలం చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. చిట్టిబాబుగా రాంచరణ్ చెలరేగి నటిచడంతో చిత్రానికి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. 1980 నాటి గ్రామపంచాయతీ రాజకీయాలని సుకుమార్ కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించాడు. సుకుమార్ టేకింగ్ కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. రాంచరణ్ వినికిడిలోపం ఉన్న యువకుడిగా నటన ఇరగదీశాడు. మెగాస్టార్ చిరంజీవికి తగ్గ వారసుడు అంటూ ప్రశంసలు గక్కుతున్నాయి. అభిమానుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో రంగస్థలం చిత్రాన్ని కలెక్షన్స్ ప్రవాహంలా వస్తున్నాయి. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ విభిన్నమైన గెటప్, సమంత, ఆదిపినిశెట్టి నటన, ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు పెర్ఫామెన్స్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్ర విజయం పట్ల ఇప్పటికే చాలా మంది ప్రముఖులు స్పందించారు. తాజాగా రాంచరణ్ సోదరి సుస్మిత కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ చిత్రానికి ఆమె కాస్ట్యూమ్స్ ఎంపిక చేసారు. రంగస్థలం ఊర్లోనుంచి బయటకు రావాలని అనిపించడం లేదని సుస్మిత సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. ఇలాంటి అద్భుతమైన చిత్రం సుకుమార్ వల్ల మాత్రమే సాధ్యం అని ఆమె అన్నారు. రాంచరణ్ ఎమోషనల్ గా నటించిన తీరు అద్భుతం అని సుస్మిత తెలిపింది. తన సోదరుడి పట్ల గర్వంగా ఫీలవుతున్నానని సుస్మిత తెలిపింది. రంగస్థలం చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా హైలైట్ గా నిలిచింది. చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంది. రాంచరణ్ కెరీర్ లో ఈ చిత్రానికి బెస్ట్ ఓపెనింగ్స్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ లో ఈ చిత్రం ఇప్పటికే మిలియన్ మార్క్ ని దాటేసింది.