గతేడాది కన్నుమూసిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వారి కుటుంబానికి చెందిన బంధువులు ప్రాణాలు కోల్పోయారు.

సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌(Sushant Singh Rajput) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో సుశాంత్‌ సింగ్‌రాజ్‌ పుత్‌ ఫ్యామిలీకి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్రంగా కలచి వేస్తుంది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్‌ కుటుంబానికి చెందిన బంధువులు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్‌ బంధువు ఓం ప్రకాష్‌ సోదరి అంత్యక్రియలకు హాజరై తిరిగి పాట్నా నుంచి వస్తుండగా లఖిసరాయ్‌ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Sushant Singh Rajput కుటుంబ బంధువులు ప్రయాణిస్తున్న సుమో.. ట్రక్‌ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమోలో మొత్తం పది మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో సుశాంత్‌ మేనల్లుడు సహా, బావా, హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ ఓం ప్రకాష్‌ సింగ్‌ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గతేడాది జూన్‌ 14న ముంబయి, బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం వెనకాలనే అనేక కోణాలున్నట్టు వార్తలొచ్చాయి. డ్రగ్స్ కోణం, మాఫియా, ప్రియురాలు మోసం చేసిందని, ఇలా నానా రకాలుగా ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌లో నెపోటిజం కూడా సుశాంత్‌ మరణానికి కారమన్నారు. సుశాంత్‌ మరణం దేశాన్ని కుదిపేసింది. ఆయన కేసు సైతం దుమారం రేపింది. సీబీఐ ఈ కేసుని విచారించింది. కానీ ఇప్పటి వరకు ఈ కేసుపై స్పష్టమైన రిపోర్ట్ రాలేదు. 

ఇక సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ `ఎంఎస్‌ధోని` చిత్రంతో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇందులో ధోనీ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ధోనీ ఇలానే ఉంటాడా? అనేట్టుగా పాత్రని రక్తికట్టించాడు. ఈసినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్నారు. 2013లో `కయి పో చె` చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైన సుశాంత్‌ `శుద్ద్‌ దేశీ రొమాన్స్`, `పీకే`, `ఎంఎస్‌ధోనిః ది అన్‌టోల్డ్ స్టోరీ`, `రాబ్తా`, `వెల్‌ కమ్‌ టూ న్యూయార్క్`, `కేథార్‌నాథ్‌`, `సోంచారియా`, `చిచ్చోర్`, `డ్రైవ్‌`, `దిల్‌ బెచారా` చిత్రాల్లో నటించారు. 

also read: నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం... సైకో పని, పెదవులూ మెడపై గాాయాలు