Asianet News TeluguAsianet News Telugu

మాక్కూడా భయపెట్టడం వచ్చు-మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్

  • ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు
  • పుట్టినరోజు కానుకగా స్పైడర్ టీజర్ విడుదల
  • స్పైడర్ టీజర్ లో మాక్కూడా భయపెట్టడం వచ్చంటున్న మహేష్

 

super star mahesh babu birthday special article

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో బాల నటుడిగా కరియర్ ప్రారంభించి... టాలీవుడ్ టాప్ రేంజ్ హీరోగా ఎదిగిన మహేష్ ఇవాళ 42వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. సినిమాలు, ఇల్లు తప్ప ఆయనకు మరో ప్రపంచం తెలియదు. ఇండస్ట్రీలో అతికొద్ది మంది మాత్రమే స్నేహితులున్నారు. సంప్రదాయాలకు, కట్టుబాట్లకు ఎనలేని గౌరవమిచ్చే మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది ఆసియానెట్ గ్రూప్. ఆయనకు సంబంధించిన మరిన్ని విశేషాలతో ఓ స్పాట్ లైట్..

 

నాలుగేళ్లకే కెమెరా ముందుకు...

మహేష్ బాబు తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తెరకెక్కించిన “నీడ” చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. చిన్నతనంలో చదువు కొనసాగిస్తూనే సెలవులలో తన తండ్రి కృష్ణ గారి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు.

1983 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కోరిక మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు. ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రంలో మహేష్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని చెప్పారట. 1987‌లో మహేష్ బాబు తొలిసారిగా తన తండ్రి కృష్ణ దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988 లో కృష్ణ, అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి బాలనటుడిగా ద్విపాత్రభినయం చేశాడు. 1990 లో విడుదలైన బాలచంద్రుడు తర్వాత, అన్న-తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తొలి ఇన్నింగ్స్ ని ముగించాడు.

 

హీరోగా “రాజకుమారుడు”తో ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్...

మహేష్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం రాజకుమారుడు. ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత 'వంశీ' సినిమాలో తనతో కలసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ తో ప్రేమలో పడిన మహేష్.. అప్పట్లో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలనటుడిగా కొన్ని సినిమాలు పూర్తయిన తర్వాత పై చదువుల కోసం గ్యాప్ తీసుకున్న మహేష్.. డిగ్రీ పూర్తి చేసి..‘రాజకుమారుడు' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కెరీర్లో తొలి భారీ హిట్.

 

గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ‘ఒక్కడు' మహేష్ బాబు స్టార్ ఇమేజ్ మరింత పెంచింది. మహేష్ బాబు నటించిన ‘నిజం' చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. గుర్తుండిపోయే పాత్ర మహేష్ కెరీర్లో ప్రేక్షకులకు బాగానచ్చిన చిత్రం 2005లో విడుదలైన ‘అతడు'. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి నంది అవార్డు అందుకున్నారు.

 

2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదు చేసింది. దక్షిణ భారత సినీచరిత్రలో.. ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న అమితాబ్ బచ్చన్, రాంగోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు. ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.

 

ఐదేళ్ల పాటు గడ్డుకాలం, దూకుడుతో తిరిగి దూకుడు...

పోకిరీ తరువాత వచ్చిన నిర్మాణమయిన ‘సైనికుడు'(2006), ఆ తరువాత వచ్చిన ‘అతిథి'(2007) బాక్సాఫీసు వద్ద పరాజయంపాలయ్యాయి. 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ‘ఖలేజా'(2010)కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

2011లో వచ్చిన 'దూకుడు' చిత్రంతో మహేష్ బాబు మళ్లీ ఫాంలోకి వచ్చారు. మహేష్ కెరీర్లోనే ఇది అతిపెద్ద హిట్. 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. తర్వాత వెంకటేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీస్టారర్ సినిమా చేయగా అది కూడా పెద్ద హిట్. వన్ ఒక డిఫరంట్ మూవీ సుకుమార్ దర్శకత్వంలో 'వన్-నేనొక్కడినే' అనే ఒక డిఫరెంట్ చిత్రంలో మహేష్ నటించాడు. అది ఒక అద్భుతమైన సినిమాగా సినీ విమర్శకుల నీరాజనాలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తర్వాత వచ్చిన ఆగడు కూడా పెద్ద ప్లాప్.

 

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ అయింది. ‘శ్రీమంతుడు' చిత్రానికి మహేష్ బాబు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈచిత్రం ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించి మహేష్ బాబు కీర్తిని మరింత పెంచి శ్రీమంతుడిని చేసింది. తరువాత ఎన్నో అంచనాల మద్య విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఆకట్టుకోలేకపోయింది.

పుట్టినరోజు కానుకగా స్పైడర్ టీజర్...

ప్రస్థుతం మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్' చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. మహేష్ పుట్టినరోజు కానుకగా స్పైడర్ టీజర్ కూడా రిలీజ్ చేయడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇదేకాక కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను' అనే చిత్రంలో, వంశీపైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు సూపర్ స్టార్ .

Follow Us:
Download App:
  • android
  • ios