టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు సుమంత్. వరుస పరాజయాలు కూడా ఆయన్ని దెబ్బతీయటంతో కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. గతేడాది వచ్చిన ‘నరుడా డోనరుడా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కొంత గ్యాప్ తర్వాత ‘మళ్ళీరావా... సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ మూవీ సుమంత్‌ కి కలిసొచ్చిందా చూద్దాం.

 

కథ...
కార్తిక్ (సుమంత్) స్కూళ్లో చదువుకునే రోజుల్లో పద్నాలుగవ ఏటనే తన తోటి స్టూడెంట్ అంజలిని (ఆకాంక్ష సింగ్) ప్రేమిస్తాడు. కానీ ఇద్దరి ఇంట్లోని పెద్దలు విషయం తెలిసి వాళ్ళను మందలిస్తారు. అంజలిని పేరెంట్స్ ఆ ఊరి నుండి దూరంగా తీసుకెళ్ళిపోతారు. అలా 13 ఏళ్ల పాటు అంజలికి దూరమైనా కార్తిక్ ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు. ఒక రోజు అంజలి సడన్ గా అతను జాబ్ చేసే కంపెనీకే వస్తుంది. అలా కలిసిని వాళ్లిద్దరూ తమ ప్రేమను తిరిగి కొనసాగిస్తారు. కార్తిక్ ప్రేమను అర్థం చేసుకున్న అంజలి తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

 

అయితే సడెన్ గా పెళ్లి సమయానికి.. తనకు కార్తిక్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొన్నాళ్ళకు తానే స్వయంగా కార్తిక్ ను వెతుక్కుంటూ వస్తుంది. అసలు అంజలి ఆఖరు నిముషంలో పెళ్లి వద్దని కార్తిక్ ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది, మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది, తిరిగొచ్చిన అంజలిని కార్తిక్ అంగీకరించాడా లేదా అనేది ఈ సినిమా.


విశ్లేషణ...
సాధారణంగా జగిరే ఓ సహజమైన ప్రేమకథను తీసుకొన్న దర్శకుడు... ఆ కథను నడిపించిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే పకడ్బంధీగా రాసుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఎమోషనల్ టచ్ వున్న చిత్రం రాలేదని చెప్పొచ్చు. ప్రేమించుకోవటం, విడిపోవడం వంటి సున్నితమైన విషయాలను అంతే సెన్సిటివ్‌గా తెరపై చూపించాడు దర్శకుడు. హీరోహీరోయిన్ల చిన్నప్పటి పాత్రల్లో నటించిన ప్రీతి, సాత్విక్ ఇద్దరూ అద్భుత హావభావాలు పలికించి కథకు పూర్తి న్యాయం చేశారు. సాత్విక్ అంత చిన్న వయసులోనే ప్రతి హావభావాన్ని చక్కగా పలికించాడు.

ప్రేమ కథను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొత్తగా చూపించిన విధానమే ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. హీరో, హీరోయిన్ ను ప్రేమించే విధానమే చాలా కొత్తగా ఉంటుంది సినిమాలో. ఒక రకంగా చెప్పాలంటే హీరో గుండెల్లో ఆకాశమంత ప్రేమున్నా, హీరోయిన్ తనను వదిలి వెళ్లిపోతున్న సందర్భాల్లో ఎందుకలా అని కనీసం ఆమెను నిలదీసి అడగలేని స్వచ్ఛమైన ప్రేమ అతనిది. ఇక చిన్నతనంలోనే హీరోని ప్రేమించిన హిరోయిన్ పెరిగిన కుటుంబ వాతావరణం వలన హీరోకి దగ్గరవడానికి వెనక్కుతగ్గుతూ ఎప్పటికప్పుడు అతన్ని దూరం చేసుకుంటూనే ఉంటుంది.

దర్శకుడు గౌతమ్ ఈ రెండు అంశాలని చక్కగా మిక్స్ చేసి సెకండాఫ్లో.. మంచి స్క్రీన్ ప్లేను రాసుకుని సినిమాను రూపొందించిన విధానం బాగుంది. ప్రేమికుల చిన్నప్పటి ప్రేమ కథలోని కొన్ని సన్నివేశాలు, పెద్దయ్యాక, ప్రస్తుతంలోని ఇంకొన్ని ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ హీరోని వదిలి వెళ్లిపోయే సందర్భం, చివర్లో అతనికి సంజాయిషీ చెప్పుకునే సందర్భం భావోద్వేగపూరితంగా ఉండి టచ్ చేస్తాయి. సుమంత్ చాలకాలం తరువాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో నటించాడు. ఈ సినిమా అతడికి మంచి బ్రేక్‌ను ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో సుమంత్ చెప్పే మాటలు కదిలిస్తాయి. 

టెక్నికల్‌గా కూడా సినిమాను అత్యుత్తమ నాణ్యతతో నిర్మించారు. సినిమాకు సంగీతం మరో బలంగా నిలిచింది. పాటలు కథతో ట్రావెల్ అవుతూ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నేరేషన్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ కథలో లీనమైపోయిన ప్రేక్షకుడికి ఆ లోటు కనిపించదు.


చివరగా...

ఫీల్ గుడ్ మూవీ ‘మళ్ళీ రావా’ చిత్రంతో సుమంత్ మళ్లీ వచ్చేశాడు.