మెగాస్టార్ చిరంజీవిపై ‘రంగస్థలం’ చిత్ర దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ.. ‘ఎంత మందికి ఎన్ని పదువులైనా ఉండొచ్చు.. కానీ ఆయనకు చిరంజీవి పదవే ప్రత్యేకం’ అని సుకుమార్ అన్నారు. ఆదివారం రాత్రి విశాఖ తీరంలో జరిగిన ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు దేవీ నాతో ఒక మాటన్నాడు. ముఖ్యమంత్రి పదవి కన్నా చిరంజీవి పదవే పెద్దది కదా ఆయనెందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అని. కాబట్టి ఎంత మందికి ఎన్ని పదవులైనా ఉండొచ్చు.. కానీ ఆయనకు చిరంజీవి పదవే ప్రత్యేకం. అది ఆయన ఒక్కరికే సాధ్యం’ అని సుకుమార్ చెప్పుకొచ్చారు.‘రంగస్థలం’ సినిమా చూసిన తరవాత చిరంజీవి తనను ఇంటికి పిలిచి సినిమా ఎలా ఉందో చెప్పారని సుకుమార్ వెల్లడించారు. ‘చిరంజీవి గారు సినిమా ఎలా ఉందో చెప్పినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక 10 కి.మీ. దూరంలో గోల్ఫ్ హోల్ ఉంది. ఇక్కడ నుంచి స్టిక్‌తో గోల్ఫ్ బాల్‌ను కొడితే వెళ్లి గోల్‌లో పడిపోయింది. కానీ చూడటానికి ఎవరూ లేరు. అంటే సినిమాలో హీరో బాధపడుతుంటే పక్కన ఉన్నవారి రియాక్షన్ చూపిస్తాం. ఇక్కడ ఆ రియాక్షన్ లేదు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే.. చిరంజీవి గారు ఆ మాటలు చెబుతున్నప్పుడు నా పక్కన ఎవరైనా ఉంటే బాగుండేదే. మా ఆవిడను తీసికెళ్లినా బాగుండేదే. తనైనా చూసి ఆనందించేది అనుకున్నా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారో ఎవరికీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ నేనొక్కడినే ఉన్నాను. నేనేం చెప్పినా అబద్ధం అనుకుంటారు’ అని సుకుమార్ తన మనసులోని మాటలను బయటపెట్టారు.
 

ఇక సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. తనకు మ్యూజిక్ అంటే దేవీ, దేవీ అంటే మ్యూజిక్ అని ఆయనపై ఉన్న అభిమాన్ని మరోసారి సుకుమార్ బయటపెట్టారు. తన ఎమోషనే దేవీ అని చెప్పారు. సమంత ఒప్పుకుంటే.. జీవితాంతం తనతో సినిమాలు తీస్తుంటానని, ఏ వయసులోనైనా ఆ వయసు తగ్గ పాత్రలు కల్పించి సినిమాలు చేస్తానని అన్నారు. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోవడానికి చరణ్‌కి ఎంతోసేపు పట్టలేదన్నారు. చాలా సన్నివేశాలు తొలి టేకులో ఓకే అయిపోయేవని, చరణ్‌ కోపం, ఆనందం, బాధ.. వీటన్నింటిలోనూ నిజాయతీ ఉంటుందని వెల్లడించారు.