మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’లోని ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో యాదవ మహిళలకు కించపరిచేలా పదాలు ఉన్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లైన్‌ను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించారు. అయితే దీనిపై ఆ సినిమా దర్శకుడు స్పష్టత ఇచ్చారు. ‘రంగస్థలం’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. దీనిలో భాగంగానే దర్శక, నిర్మాతలు గురువారం మీడియా ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో అభ్యంతరకర పదాలు ఉన్నాయనడం సమంజసం కాదన్నారు. ‘గొల్లభామ’ అనే మాట మనుషులకు సంబంధించింది కాదని, అది ఒక రకమైన పురుగు పేరని స్పష్టం చేశారు. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుందని అన్నారు. మరి సుకుమార్ వివరణతో అయినా ఈ వివాదానికి యాదవ హక్కుల పోరాట సమితి వారు తెరదించుతారో లేదో చూడాలి. వాస్తవానికి ‘గొల్లభామ’ పేరును వాడుకోవడం ఇది కొత్తేమీ కాదు. చాలా సందర్భాల్లో ఈ పేరును వాడారు. ఇదే పేరుతో తెలంగాణలో చేనేత చీరలను కూడా తయారుచేస్తున్నారు. అలాంటప్పుడు ఓ సినిమాపై ఈ పేరుతో వివాదానికి తెరలేపడం సరికాదని విమర్శకులు అంటున్నారు.