శ్రీదేవి మిస్టీరియస్ డెత్ కేసును దుబయి ప్రాసిక్యూటర్ సీరియస్ గా తీసుకోవటంతో.. కేసు ట్విస్ట్ ల మమీద ట్విస్టులు తీసుకుంటోంది. మిస్టరీగా మారిన శ్రీదేవి హఠాన్మరణం కేసులో సోమవారం సాయంత్రం నుంచి దుబాయ్ లో జరుగుతున్న పరిణామాలు అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి.

 

దక్షిణాదిలో నటిగా కెరీర్ ప్రారంభించినా అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి వెండితెరపై తన అద్భుత ప్రతిభాపాఠవాలతో సినీ జగత్తును పాదాక్రాంతం చేసుకున్న నటి శ్రీదేవి. తాజగా పరిణామాలని సినీప్రేమికులు, శ్రీదేవి అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. శ్రీదేవి ప్రస్థానం ప్రశాంతంగా ముగియదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీదేవి మృతిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో ఉన్న శ్రీదేవి బంధువు వేణు గోపాల్(శ్రీదేవికి బాబాయ్ ) ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించారు. శ్రీదేవి అనుభవాలని అయన పంచుకున్నారు.

 

తిరుపతిలో శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మతోపాటు బంధువులందరి ఇళ్ళు ఒకేదగ్గర ఉండేవి. శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మ మా అమ్మకు అన్న కూతురు. నాకు వదిన అవుతారు. శ్రీదేవికి నేను బాబాయ్ వరస అని వేణుగోపాల్ అన్నారు. శ్రీదేవి తండ్రి తమిళుడు. అందుకని వారు శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ అని పెట్టారు. కానీ మేమంతా పప్పి అని పిలిచేవాళ్ళం. సినిమాల్లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మా, నాన్నే శ్రీదేవి అని మార్చారు.

 

శ్రీదేవి బంధువులం కనుక ఆమె గురించి బయట వారికన్నా మాకే ఎక్కువ తెలుసు అని వేణుగోపాల్ అన్నారు. శ్రీదేవి స్టార్ అయ్యాక రాకపోకలు తగ్గాయి.. కానీ శ్రీదేవి మమ్మల్ని మాత్రం మర్చిపోలేదు. నా కొడుకు ఉమేష్ ని బాగా చూసుకునేది. మేము ఇల్లు కట్టుకుంటుంటే కూడా సాయం చేసింది. ఆమెని కలుసుకోవడానికి ఎప్పుడు వెళ్లినా ఖచ్చితంగా సాయం చేస్తుంది.

 

బోనికపూర్ తో వివాహం జరిగాక శ్రీదేవి ముంబై వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాకపోకలు బాగా తగ్గాయి. కానీ ప్రతి ఏడాది శ్రీదేవి ఆగస్టు 13 న తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వస్తుంది. అప్పుడు అందరిని కలిసేది అని వేణుగోపాల్ అన్నారు. బోనికపూర్ కూడా తమతో బాగా ఉండేవారని ఆయన అన్నారు. భాష సమస్య వలన సరిగా మాట్లాడలేకపోవచ్చు. కానీ తమకు బాగా మర్యాద ఇచ్చేవారు అని అన్నారు.

 

శ్రీదేవి నాలుగేళ్ళ వయసులోనే నటించడానికి మద్రాసు వెళ్ళిపోయింది. ఇంతపెద్ద స్టార్ అవుతానందని ఊహించలేదు అని వేణుగోపాల్ అన్నారు. అయినా బిడ్డ ఇంత పెద్ద స్టార్ అయిందంటే మాకు చాలా సంతోషం. శ్రీదేవి బంధువులం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అని అయన అన్నారు.

శ్రీదేవి ముక్కుకు ఆపరేషన్ చెసించుకుందని విన్నాం. సర్జరీలు ప్రమాదం అని కూడా విన్నాం. రాజేశ్వరమ్మ ఉన్నప్పుడు కష్టసుఖాలు మాట్లాడుకునే వాళ్ళం. ఆవిడ పోయాక సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేకుండా పోయింది. శ్రీదేవి మృతి విషయంలో టీవీలో ఏవేవో చూపిస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు.

 

శ్రీదేవి ఇబ్బందులో ఉన్నట్లు, మనసులో బాధ పడుతున్నట్లు మాతో చెప్పలేదు. బోనికపూర్ గారి మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ ఇబ్బంది పెట్టేవాడిని బంధువులతో శ్రీదేవి చెప్పుకుని భాదపడిందని వేణుగోపాల్ అన్నారు. తన భర్త ఆరోగ్యం గురించి శ్రీదేవి ఎప్పుడూ దిగులు పడేదని, బోనికపూర్ ఓ సారి షుగర్ బాగా ఎక్కువవడంతో తాను, పిల్లలు ఏమైపోతామో అని దిగులు చెందినట్లు మా బంధువులు చెబితే విన్నాం అని ఆయన అన్నారు.

 

శ్రీదేవికి చెల్లెలు శ్రీలతతో తల్లి రాజేశ్వరమ్మ ఆసుపత్రిలో మరణించిన సందర్భంలో బిల్లు విషయంలో మస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆ గొడవ సద్దుమణిగిపోయింది. ఇలా శ్రీదేవి మా కుటుంబానికి గర్వకారణం. కూతురి సినిమాని కళ్లారా చూసుకోకుండానే మరణించింది. కానీ ఇలా దేశం కానీ దేశంలో మరణించడం, అది వివాదంగా మారుతుండడం భరించలేకపోతున్నాం అని వేణుగోపాల్ అన్నారు.