Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి కుటుంబ నేపథ్యం,సొంతూరు వివరాలు తెలుసా?

  • అలనాటి అందాల తార శ్రీదేవి హఠాన్మరణంతో శోక సంద్రంలో తారా లోకం
  • ఇవాళ రాత్రి పది గంటల తర్వాత ముంబైకి శ్రీదేవి పార్థివ దేహం
  • దేశంలోనే సూపర్ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి కుటుంబ నేపథ్యం, సొంతూరు వివరాలు

 

sridevi family back ground and native place details

నాలుగేళ్ల చిరు ప్రాయంలోనే సినిమా కెరీర్ ప్రారంభించిన అందాల నటి  శ్రీదేవి పుట్టిన గ్రామం మీనంపట్టి. తన చిరుప్రాయం అంతా అక్కడే గడిచింది. శ్రీదేవి ప్రాథమిక విద్యనభ్యసించింది కూడా మీనంపట్టిలోనే. అక్కడి నుండి చెన్నైకి మారిన శ్రీదేవి.. ఆ తర్వాత తన సొంతూరు మీనంపట్టికి చాలా కొద్ది సందర్భాల్లో వెళ్లింది. అయితే ఇప్పటికీ మీనంపట్టిలో శ్రీదేవి కుటుంబానికి, తన పూర్వికులకు చెందిన ఆస్తులు ఇంకా వున్నాయి. ఆవూరికి చెందిన ఒక కమ్మనాయుడి  కుటుంబంలో శ్రీదేవి జన్మించింది.

 

శ్రీదేవి కుటుంబం ఎపుడో రెండు మూడు వందల సంవత్సరాల కిందట చిత్తూరు జిల్లా నుంచి అక్కడికి వలస వెళ్లింది. శ్రీదేవి తండ్రి అయ్యప్ప నాయుడు. తల్లి రాజేశ్వరి. ఆమెకుటుంబం సాదసీదా కుటుంబమేమీకాదు. మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే.

 

తమిళనాడులోని విరుథ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం మీనంపట్టి. ఇదే దేశంలోనే సూపర్ స్టార్ గా అవతరించిన శ్రీదేవి జన్మస్థలం. శనివారం రాత్రి అకస్మాత్తుగా శ్రీదేవి హఠాన్మరణంతో మీనంపట్టి గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గ్రామస్తులు శ్రీదేవికి గ్రామంలో నివాళులర్పించారు. శ్రీదేవి చిన్ననాటి ఫోటోతోపాటు ఫ్యామిలీ ఫోటోల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులలర్పించారు.

 

అంతేకాక గ్రామంలో శ్రీదేవి పర్యటించినప్పుడు తిరిగిన ప్రదేశాలన్నింటినీ గుర్తుచేస్తున్నారు గ్రామస్థులు. అంతేకాదు ముఫ్పయేళ్లుగా శ్రీదేవి కుటుంబానికి సన్నిహితులైన శ్రీనివాసన్ అనే వ్యక్తి శ్రీదేవి కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబమని, శ్రీదేవి తండ్రి రాజకీయాలల్లో చాలా యాక్టివ్ గా పనిచేశారని, గ్రామంలో సంపన్న కుటుంబాల్లో శ్రీదేవి కుటుంబం ఒకటని తెలిపారు.

 

శ్రీదేవి తండ్రి అయ్యప్ప నాయుడు పెద్దన్న, శ్రీదేవి పెదనాన్న రామసామి నాయుడు 1977లో జనతా పార్టీ తరపున శివకాశి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాక ఆయన శివకాశి పంచాయితీకి పాతికేళ్ల పాటు పంచాయితీ ప్రెసిడెంటుగా వ్యవహరించారు.

 

అంతే కాక శ్రీదేవి తండ్రి అయ్యప్పనాయుడు కూడా 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున శివకాశి అసెంబ్లీ సెగ్మెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. 1989 ఎన్నికలలోనే తన తండ్రి తరపున ప్రచారం కూడా చేసిన శ్రీదేవి ఇక ఆ తర్వాత మీనంపట్టికి రాలేదని తెలుస్తోంది.

 

శ్రీదేవి చివరిసారిగా తన గ్రామానికి వచ్చినప్పుడు.. గ్రామంలో పది రోజులపాటు వుండటమే కాక ఊళ్లోని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లింది. అంతేకాక తన గ్రామాన్ని ఎంతో ఇష్ట పడ్డ శ్రీదేవి.. ఊళ్లోవాళ్లు చెప్పే సంగతులన్నీ వింటూ.. తన కుటుంబ నేపథ్యం గురించి గ్రామస్థుల ద్వారా మరింత సమాచారం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపింది. అయితే.. 1990లో తన తండ్రి, అనంతరం 1996లో శ్రీదేవి తల్లి మరణించిన తర్వాత.. శ్రీదేవి మీనంపట్టి ఊరికి రావటం మానేసింది.

 

ఇటీవల కాలంలో తను మీనంపట్టికి రాకున్నా... 30 ఏళ్ల క్రితం శ్రీదేవి మీనంపట్టిని సందర్శించినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గ్రామస్థులు శ్రీదేవి పట్ల తమకున్న ప్రేమాభిమానాలను చాటుతున్నారని శ్రీనివాసన్ తెలిపారు.

 

ఇప్పటికీ ఊళ్లో శ్రీదేవి తండ్రిని మీనంపట్టి ముదలాలి అంటే మీనంపట్టి జమీందార్ అని పిలుస్తారట. అంతేకాక శ్రీదేవి కుటుంబానికి చెందిన సంజయ్ రామసామి విరుధ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సొంతూళ్లో ఆస్తులు కలిగివుండటమే కాక... ఊళ్లో ప్రాథమిక పాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి పెద్దమ్మ సరస్వతి(రామసామి నాయుడు సతీమణి) ఇప్పటికీ ఊళ్లోనే వుంటూ వాళ్ల ఆస్తులన్నీ చూసుకుంటుందట.

Follow Us:
Download App:
  • android
  • ios