శ్రీదేవి ఆకస్మిక మృతితో సినీ ప్రేక్షకలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బాలీవుడ్ సహనటులు విషాద సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి బాల్య స్నేహితురాలు, ప్రముఖ నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి కూతురు పింకిరెడ్డి సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టింది.

 

మొహిత్ మార్వా వివాహానికి వెళ్లే ముందు తాను శ్రీదేవితో కడసారి మాట్లాడాను. తనకు ఆనారోగ్యంగా ఉంది. మొహిత్ పెళ్లికి వెల్లడం ఇష్టం లేదు. నేను యాంటీ బయోటిక్స్ వాడుతున్నాను అని నాకు చెప్పింది. కుటుంబ కారణాల వల్ల శ్రీదేవి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి హాజరుకావాల్సి వచ్చింది. కానీ దుబాయ్‌కి వెళ్లిన శ్రీదేవి శాశ్వతంగా దూరమవుతుందని ఊహించలేదు అని పింకిరెడ్డి ఉద్వేగానికి లోనైంది.

 

నేను 8 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నాకు శ్రీదేవితో పరిచయం జరిగింది. అప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా మారాం. ఇప్పుడు నా సోదరి లాంటి శ్రీదేవిని శాశ్వతంగా కోల్పోయాను అని పింకిరెడ్డి చెప్పింది. శ్రీదేవి వ్యక్తిగత జీవితంలోనే కాకుండా సినీ జీవితంలో కూడా పింకిరెడ్డి ప్రధాన పాత్ర పోషించింది. అత్యంత ప్రజాదరణను మూటగట్టుకొన్న చాందినీ చిత్రానికి నా తండ్రి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంతో సంబంధాలున్న శ్రీదేవి మరణం షాక్ గురిచేసింది. చాలా కుంగిపోయాను అని పింకిరెడ్డి వెల్లడించింది.

 

ఇక మిస్టరీగా మారిన ప్రశ్నకు సంబంధించి అనారోగ్యంతోనే శ్రీదేవి దుబాయ్‌కి వెళ్లింది. దుబాయ్ వెళ్లే ముందు రోజు వరకు ప్రతీరోజు శ్రీదేవితో మాట్లాడాను. కొద్దిరోజులుగా శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నది. అప్పుడు యాంటి బయోటిక్స్ తీసుకొంటున్నారు. చాలా నీరసంగా ఉన్నట్టు కనిపించింది. కానీ పెళ్లికి వెళ్లక తప్పడం లేదు అని చెప్పిందని పింకిరెడ్డి తెలిపింది.

 

సినీరంగంలో మహోన్నత కీర్తి సాధించిన శ్రీదేవి మరణంపై కొందరు జోక్‌గా మార్చడంపై పింకిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మరణంపై సందేశాలు వ్యక్తం చేస్తున్న తీరుపై కోపాన్ని తెప్పించింది అని ఆమె అన్నారు. శ్రీదేవి బరువు తగ్గడానికి లైపోసెక్షన్ చెయించుకొన్నదనే వార్తలో వాస్తవం లేదు. ప్రజలు ఎందుకు ఇలా మాట్లాడుకొంటారో అర్థం కాదు. ఆమె సాధించిన మంచి గురించి ఎందుకు మాట్లాడుకోరు. శ్రీదేవి భౌతికంగా లేనప్పుడు ఆమె గురించి చెడుగా మాట్లాడుకోవడం సరికాదు అని చెప్పింది.

 

శ్రీదేవి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని కూడా పింకిరెడ్డి తోసిపుచ్చింది. శ్రీదేవిని బోని బాగా చూసుకొన్నారు. వారిద్దరిది అన్యోన్య జీవితం. వారి మధ్య కలతలు, కలహాలు ఉన్నట్టు కూడా నా దృష్టికి రాలేదు. ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది అని పింకిరెడ్డి చెప్పింది. ఇటీవల నా కూతురు శ్రీమంతం కోసం శ్రీదేవి హైదరాబాద్‌కు వచ్చింది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నా కోసం కేవలం రెండు గంటలు ఉండి వెళ్లింది. ఆమెను కలవడం, చూడటం అదే చివరిసారి అని పింకిరెడ్డి చెప్పింది.