స్పైడర్ మూవీ విడుదల కొద్ది గంటల్లోనే.. ఓవర్సీస్ రికార్డులు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం రూ.500 కోట్లు వసూళ్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న స్పైడర్ టీమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్పైడర్. విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్న స్పైడర్ కేవలం స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ అత్యధిక కేంద్రాల్లో విడుదలవుతున్నది. బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ కానున్న చిత్రంగా రికార్డును సొంతం చేసుకొంది స్పైడర్.

స్పైడర్ చిత్రం అమెరికా పంపిణీలో హక్కులను ఆట్మస్, ఏజెడ్ ఇండియా మీడియా దాదాపు రూ.8 కోట్లు చెల్లించి దక్కించుకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్‌లో ఏటీ అండ్ టీ, సినీమార్క్ థియేటర్స్, ఏంఎమ్సీ, ఫాండాగో ఇతర సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. టికెట్లపై రాయితీలను కూడా ప్రకటించాయి. తెలుగు, తమిళ రాష్రాల్లో కంటే ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 26నే ఈ చిత్రం విడుదల అవుతున్నది.

అమెరికాలో స్పైడర్ చిత్రం సుమారు 300 స్కీన్లలో రిలీజ్ అవుతోందట. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలు దిల్‌వాలే, దంగల్, బాహుబలి2 చిత్రాలు మాత్రమే 300 స్కీన్లలో విడుదలయ్యాయి. ఆ తర్వాత అదే స్థాయిలో విడుదలవుతున్న చిత్రంగా స్పైడర్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

స్పైడర్ అడ్వాన్స్ బుకింగ్ కు అమెరికాలో విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం నాటికి 5 లక్షల డాలర్ల మేర టికెట్లు అమ్ముడుపోయాయి. చాలా హాళ్లలో అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్ అయింది. పలు స్క్రీన్ల వద్ద టికెట్స్ సోల్డ్ అవుట్ అనే బోర్డులు దర్శనమివ్వడం ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌కు అద్దం పట్టింది. అమెరికాలో ప్రీమియర్ షో పడే 26వ తేదీ రాత్రి వరకే స్పైడర్ ఒక మిలియన్ డాలర్ల మార్కును సులభంగా దాటేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, అరబిక్ భాషల్లో విడుదలవుతున్నది. తమిళ, మలయాళంలో నేరుగా మహేశ్ బాబు సినిమా రిలీజ్ కావడం ఇదే ప్రథమం.

స్పైడర్‌పై భారీ అంచనాలు ఉండటం 27న బుధవారం స్పైడర్ రిలీజ్ కావడం, ఆ తర్వాత అక్టోబర్ 2 వరకు అన్నీ సెలవు దినాలు ఉండటం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. స్పైడర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా దుమ్ము రేపడం ఖాయమనే మాట వినిపిస్తోంది. తమిళ, మలయాళం, హిందీలో దర్శకుడు మురుగదాస్‌కు మంచి మార్కెట్ ఉంది. ఆయన రూపొందించిన హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మలేషియా, సింగపూర్, మస్కట్, ఇతర ప్రదేశాల్లో తమిళ, తెలుగు ప్రేక్షకులు భారీగానే ఉన్నారు.

ఒకవేళ స్పైడర్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొంటే దాదాపు రూ.500 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి సుమారు 800 స్క్రీన్లలో విడుదల కానుంది. బాహుబలి2 చిత్రం 1000 స్క్రీన్లలో రిలీజైన సంగతి తెలిసిందే. అంతేకాక ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డులను స్పైడర్ బ్రేక్ చేసి.. మహేశ్ కెరీర్‌లోనే నెం.1 సినిమాగా నిలవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ఖైదీ నెం.150 కూడా ఓవర్సీస్‌లో జనవరి 10న మంగళవారమే విడుదలయింది. తద్వారా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ల ద్వారానే 12,70,29 డాలర్లు (8 కోట్ల 65 లక్షలు) కొల్లగొట్టింది. ఈ రికార్డును స్పైడర్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ఓవర్సీస్ విశ్లేషకులు చెబుతున్నారు.