Asianet News TeluguAsianet News Telugu

నేను అజాన్ కో ఆర్తి కో వ్యతిరేకం కాదు, లౌడ్ స్పీకర్స్ పై మాత్రం తగ్గనంటున్న సోనూ

  • మసీదుల్లో, మందిరాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టడంపై సోనూ నిగమ్ అసహనం
  • ట్విటర్ లో దీనిపై ఘాటుగా స్పందించిన సోనూ నిగమ్
  • సోనూ ట్వీట్ పై విమర్శలు చేస్తున్న పలు ధార్మిక, ముస్లిం సంఘాలు
  • అయితే తాను అజాన్ కో, ఆర్తికో వ్యతిరేకం కాదని ,లౌడ్ స్పీకర్లకు మాత్రమేనన్న సోను
sonu nigam tweets again on azaan arthi

ఏప్రిల్ 16న సోను నిగమ్ ట్విటర్లో మసీదుల్లో అజాన్ కోసం లౌడ్ స్పీకర్లు పెట్టి వినిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సోనూ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియాలో పెను దుమారం రేగింది. ముస్లింల పట్ల ,సోనూ వ్యతిరేకత ప్రదర్శించడం సరికాదని పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. సోనూ తను చేసిన ట్వీట్ కు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశాడు. తాను ఆర్తికో, ఆజాన్ కో వ్యతిరేకం కాదని , కేవలం లౌడ్ స్పీకర్లు పెట్టి ఇతరులను ఇబ్బంది పెట్టడంపైనే తాను వ్యతిరేకినని మరోసారి స్పష్టం చేశాడు. అంతేకాక, సోనూకు మద్దతుగా నిలిచిన వారి ట్వీట్లను, కథనాలను రీ ట్వీట్ చేస్తూ తను నమ్మినదానికి కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశాడు.

 

 

దీనిపై ఓ సెక్యులరిస్టు తన అభిప్రాయాల్ని ఇలా వెల్లడించారు. మసీదుల్లో, మందిరాల్లో మైకులు పెట్టి ప్రార్థనలు వినిపించడం గుండాయిజమే అంటూ ప్రముఖ పాప్‌ గాయకుడు సోను నిగమ్‌ చేసిన ట్వీట్లపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకంటే ముందే స్పందించిన ముంబై హైకోర్టు మసీదుల్లో మైకులను ఎప్పుడో నిషేధించింది. అయినా కోర్టు ఉత్తర్వులు సరిగ్గా అమలు కావడం లేదు. అది వేరే విషయం. ‘మసీదులపై నిలబడి ముల్లాలు ఎందుకు అంత గట్టిగా పిలవాలి అల్లా ఏమీ చెవిటివాడు కాదుకదా!’ అని 15వ  శతాబ్దానికి చెందిన బ్రజ్‌ (పాశ్చాత్య హిందీ కవి) కవి కబీర్‌ ఇంకా ముందే స్పందించారు.
 
కబీర్‌ నుంచి సోనూ నిగమ్‌ వరకు ఎందరో చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. అయితే ప్రతిరోజు మసీదుల్లో, మందిరాల్లోనే వినిపించే ప్రార్థనలే గూండాయిజమా? వినాయకుని నిమజ్జనానికి, దుర్గా పూజకు, క్రిస్మస్‌ పండగకు మైకుల్లో అదరగొట్టే నినాదాలు, భక్తి గీతాలు, గుండెలు ఆగిపోయే రీతిలో డప్పులు మోగించడం, ఢిల్లీలో జరిగే జాగారణ రాత్రుల్లో తెల్లార్లు మైకుల్లో భజనలు, కీర్తనలు వినిపించడం గూండాయిజం కాదా? అన్నదానిపై కూడా సోనూ నిగమ్ స్పందించాలి.

 
అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ గ్రంధాల ప్రకారం మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించినప్పుడు మైకులు లేవు. జనాన్ని పోగేసేందుకు గట్టిగా అరచి పిలిచే శక్తిగల యువకులను ప్రవక్త స్వయంగా నియమించారు. వారు మసీదులపైకి ఎక్కి సమావేశం ప్రారంభం అవుతుందన్న విషయాన్ని సూచించడానికి గట్టిగా పిలిచేవారు. అలా పిలిచేవారే కాలక్రమంలో ముల్లాలయ్యారు. కాలక్రమంలో మైకులు రావడంతో వారు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. నేడు ప్రార్థనా సమయాలు అందరికి తెలుసు. అందరి వద్ద గడియారాలున్నాయి. ఇప్పుడు కూడా మైకులు ఉపయోగించడం అవసరమా? ఇతరులను ఇబ్బంది పెట్టడం ఏ దేవుడు కోరుకుంటారు?

 

Follow Us:
Download App:
  • android
  • ios