శ్రీదేవి మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ విషాదం. కానీ విషాదం కాస్తా ఇప్పుడు మిస్టరీగా మారింది. దుబాయ్‌లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పోలీసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసిన అనంతరం దేశం మొత్తం నివ్వెర పోయింది. అతిలోక సుందరి అంత దయనీయ స్థితిలో మరణించడం జీర్ణించుకోలేక పోతున్నారు. 

 

శ్రీదేవి మరణానికి కారణం గుండె పోటు అని చెప్పి ఇప్పటి వరకు అందరినీ నమ్మించారు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు. కానీ సోమవారం విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్టులో కార్డియాక్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదు. ప్రమాద వశాత్తు బాత్ టబ్‍‌లో పడిపోవడం వల్ల ఆమె మరణించినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొనబడి ఉంది. దీంతో ఆమె అభిమానుల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

 

ఫోరెన్సిక్ రిపోర్టులో శ్రీదేవి శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎంత మద్యం మత్తులో ఉన్నా.... బాత్ టబ్ లో పడి చనిపోవడం జరుగుతుందా? అసలు చనిపోయే ముందు ఆమె కేకలు పెట్టి ఉండరా? కేకలు పెడితే రూములో ఉన్న వారికి వినపడలేదా? అసలు ఆ సమయంలో ఆమెతో ఎవరు ఉన్నారు? అనే విషయంలో క్లారిటీ లేదు.

 

దుబాయ్‌లోని హోటల్‌లో శ్రీదేవి మూడు రోజులుగా ఒంటరిగా ఉంటోందని, గది నుండి బయటకు రాలేదనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. శ్రీదేవి మరణం తర్వాత ఆమె బస చేసిన హోటల్ పేరు తప్ప ఎలాంటి దృశ్యాలు, మరే ఇతర వివరాలు బయటకు రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంత రహస్యంగా ఎందుకు ఉంటున్నారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. దుబాయ్‌లో బంధువుల పెళ్లి తర్వాత బోనీ కపూర్ వెనక్కి వచ్చేశారని మొదట చెప్పారు. తర్వాత ఇండియా వచ్చి శ్రీదేవిని సర్ ప్రైజ్ చేయడానికి వెనక్కి వెళ్లారనే ప్రచారం జరిగింది.

 

బాత్ టబ్ లో పడిపోవడం వల్ల శ్రీదేవి ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, అయితే శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలియజేస్తోంది. ఆమె మరణం వెనక కుట్ర లేదని చెబుతున్నా అభిమానుల్లో అనుమానాలు నివృత్తి కావడం లేదు. దేశంకాని దేశంలో అనుమానాస్పదంగా శ్రీదేవి దయనీయ స్థితిలో మరణించడం అభిమానులను కలిచివేస్తోంది. అసలు అతిలోక సుందరి మరణం వెనక వాస్తవాలు తెలియక అభిమానులు అయోమయంలో ఉండిపోయారు. 

మరో వైపు శ్రీదేవి బస చేసిన హోటల్ రూమును దుబాయ్ పోలీసులు సీజ్ చేశారు. అవసరం అయితే పోలీసులు మరోసారి రూమును పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ను ఇప్పటికే 3 గంటలకు పైగా విచారించారు. ఆయన్ను మరోసారి విచారించే అవకాశం ఉంది.