కాలం చాలా నిర్దాక్ష్యమైనది. ఎంతటి ప్రతిభ ఉన్న వ్యక్తులనైనా..వేరే వారికి అవకాసం ఇవ్వాలనే వంకతో ప్రక్కన పెట్టేస్తుంది. అయితే ప్రతిభ ఉన్న వ్యక్తులు అలా ప్రక్కన పడిపోవటానికి ఇష్టపడరు. పడినా పడుకుండిపోవటానికి అసలు ఇష్టపడరు. కష్టపడి తమకు ఇష్టమైన రంగంలో మళ్లీ తామేంటో ప్రూవ్ చేసుకోవటానికి ప్రతీ క్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో శివనాగేశ్వరరావు ఒకరు. ఒకప్పుడు తన సమకాలీనులు కన్నా ఓ అడుగు ముందుకేసి కాల పరీక్షలో నిలబడే మనీ వంటి సినిమాని ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పటికీ మని సినిమా టీవిల్లో వస్తోందంటే ఆపకుండా చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వన్ బై టు అన్నా, మనీ మనీ అన్నా, హాండ్స్ అప్ అన్నా ఆయనకే చెల్లింది. 

ఇదేంటి ఆయన పుట్టిన రోజా..ఇలా వరసపెట్టి ఆయన గురించి చెప్పుకుంటూ పోతున్నారు అంటే ..అదేమీ కాదు..ఆయన మళ్లీ తిరిగి తన ప్రస్దానాన్ని కొనసాగించటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. టాలెంట్ ఉన్నవాడికి కాస్తంత ఉత్తేజం ఇస్తే చెలరేగిపోతాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన త్వరలో ఓ కామెడీ సినిమాని లాక్ డౌన్ తర్వాత ఎనౌన్స్ చేయబోతున్నారట. అలాగే ఆయన డవలప్ చేసిన స్క్రిప్టుని ఓ యువ దర్శకుడు డైరక్ట్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే వరసలో రెండు మూడు స్క్రిప్టులు ఈ ఖాళీ సమయంలో డవలప్ చేసినట్లు సమాచారం. 

అవి తను డైరక్ట్ చేయటమా లేక వేరే దర్శకుడు చేయటమా అనేది చెప్పలేనని అంటారు. యువ దర్శకులలో చాలా మందికి సినిమాని అద్బుతంగా తీసే నేర్పు ఉంటోంది కానీ స్క్రిప్టుని అంతకన్నా అద్బుతంగా రెడీ చేసుకునే ఓర్పు ఉండటం లేదు. అలాంటి వాళ్లకు శివనాగేశ్వరరావు లాంటి వాళ్లు ఓ పెద్ద నిధే..పెన్నిధే. ఇదిలా ఉంటే సీనియర్ డైరక్టర్స్ కు ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటి ప్లాట్ ఫామ్ లు అవకాశాలు ఇస్తున్నాయి. శివనాగేశ్వరరావుని కూడా ఓ సంస్ద ఎప్రోచ్ అయ్యిందంటున్నారు. ఏమో చూస్తూంటే భవిష్యత్ లో ఆయన మళ్లీ బిజీ అవుతారేమో.. నిర్మాతలకు మనీ తెచ్చిపెట్టే మరిన్ని మనీ సినిమాలు, స్క్రిప్టులు రెడీ చేస్తారేమో.