పెళ్లయిన పదహారో రోజే... అలా దారుణంగా..ప్రముఖ సింగర్ వ్యధ

పెళ్లయిన పదహారో రోజే... అలా దారుణంగా..ప్రముఖ సింగర్ వ్యధ

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తాను, వివాహమైన తొలి నాళ్లలోనే గృహ హింసను ఎదుర్కొన్నానని ప్రముఖ గాయని కౌసల్య తన జీవితానికి సంబంధించిన బాధాకర ఘటనలను గుర్తు చేసుకుంది. తనను అర్థం చేసుకుని, ప్రేమించే వ్యక్తి దొరికాడన్న భరోసాతో ఉన్న తనను, పెళ్లయిన పదహారో రోజున అందరి ముందూ భర్త కొట్టాడని చెప్పింది.ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన కౌసల్య, పెళ్లిలో తమకు మర్యాదలు సరిగ్గా చేయలేదని గొడవకు దిగగా, తన తల్లిని ఏమీ అనవద్దని అన్నందుకే కొట్టాడని, ఆ దెబ్బ ప్రభావం ఏళ్లు గడిచినా తనపై ఇంకా ఉందని చెప్పింది. అప్పుడే చనిపోవాలని, విడాకులు తీసుకోవాలని అనుకున్నానని, అయితే, చిన్నతనంలోనే తండ్రి చనిపోగా, కష్టపడి పెంచిన తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెలు, సొసైటీ గురించిన ఆలోచన వచ్చి ఆగిపోయానని చెప్పింది.


ఇటువంటి తప్పు మరోసారి చేయనని భర్త చెబితే, క్షమించానని, ఆపై తాను పదే పదే కొడుతూ వచ్చాడని, అత్తమామలు అతనికే మద్దతిస్తూ, చూసీ చూడనట్టు వెళ్లాలని తనకే సలహాలు ఇచ్చారని వాపోయింది. ఆ తరువాత అతనికి ఇంకో అమ్మాయితో సంబంధముందని, వారికో బిడ్డ కూడా ఉన్నాడని తెలిసి తట్టుకోలేకపోయానని కౌసల్య వెల్లడించింది.


బాబు పుట్టిన ఆరేళ్ల తరువాత కూడా ఇదే పరిస్థితి ఉందని, 'సూపర్ సింగర్ 7' జరుగుతున్న వేళ, సమస్యను పరిష్కరించేందుకు తన బావ వచ్చిన వేళ, వాళ్ల ముందు తనను రక్తం కారేలా కొట్టాడని, ఆ సమయంలో బాబు వచ్చి, "అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్‌ కొట్టొద్దు నాన్నా" అని వేడుకుంటుంటే హృదయం బాధతో ద్రవించిపోయిందని చెప్పింది.


అప్పట్లో నిస్సహాయ స్థితిలో పోలీసుల వద్దకు వెళ్లి, కేసులు లేకుండా తన భర్తను పిలిచి మాట్లాడాలని చెప్పానని, కానీ కేసు వేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందని కౌసల్య వెల్లడించింది. భరించడానికి కూడా ఓ హద్దు ఉంటుందని, భర్త మారతాడని ఏళ్ల తరబడి ఎదురు చూశానని, కానీ తన ఆశ తీరలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కొడుకును చూసుకుంటూ ఆనందంగా ఉన్నానని, ఎవరి హక్కులను వారే కాపాడుకుంటూ ముందుకు సాగాలని నిశ్చయించుకుని జీవితాన్ని సాగిస్తున్నానని వెల్లడించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page