ఎట్టకేలకు స్పందించిన సెన్సార్ బోర్డు శరణం గచ్చామి సినిమాకు గతంలో క్లియరెన్స్ ఇవ్వని సెన్సార్ బోర్డు దాడి ఘటన తర్వాత మళ్ళీ సినిమా చూసి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
'శరణం గచ్చామి' సినిమాపై కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.
తొలుత ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది సెన్సార్ బోర్డు. సినిమాలో వివాదాస్పదమైన రిజర్వేషన్ల అంశాన్ని ఫోకస్ చేసారని, ఇది శాంతిభద్రతల సమస్యకు కారణం అవుతుందని నిరాకరించారు. అయితే బోర్డ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.... హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు కేంద్ర కార్యాలయంలపై విద్యార్థి సంఘాల నేతలు ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ, ఎస్టీ తెలంగాణ విద్యార్థి సంఘం నేతృత్వంలో దాడి చేశారు.
అయితే సోమవారం పోలీసు బందోబస్తు మధ్య సెన్సార్ బోర్డు సభ్యులు మరోసారి సినిమాను వీక్షించి యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసారు. ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్, నవీన్, సంజయ్, తనిష్క్ తివారి జంటగా నటించారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు ఆర్. కృష్ణయ్య కీలక పాత్రలు పోషించారు.
నిర్మాత మురళి మాట్లాడుతూ ‘‘డాక్టరేట్ పొందిన నేను, ఎంతో పరిశోధనచేసి తయారుచేసిన సబ్జెక్టుతో ఈ సినిమా నిర్మించాను. గత డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపితే, జనవరి 2న సెన్సార్ సభ్యులు చిత్రాన్ని చూశారు. ఈ సినిమా విడుదలైతే సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందనీ, అల్లర్లు చెలరేగుతాయనీ, అందువల్ల సర్టిఫికెట్‌ను నిరాకరిస్తున్నామనీ తెలియజేస్తూ సెన్సార్ ఆఫీసర్ పంపిన ఉత్తరం అందడంతో షాకయ్యామని, ఇపుడు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో ఆనందంగా ఉందని మురళి తెలిపారు.
ఇది ఓ జర్నలిస్ట్ కథ. రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల అంశంపై పీహెచ్‌డీ చేయాలనుకున్న అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర కథ.
