ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు చెందిన ఫాం హౌస్‌ను ఆదాయపు పన్ను శాఖ వారు ఎటాచ్ చేశారు. మహారాష్ట్రలోని బీచ్‌టౌన్ అలీ‌బాగ్‌లో ఉన్న 'డేజా వు ఫార్మ్స్ ప్రై.లి'ను ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్(పిబిపిటి)కింద దీన్ని ఎటాచ్ చేశారు.

 

ఈ ప్రాపర్టీ విలువ రూ. 14.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే మార్కెట్ విలువ ఇందుకు ఐదురెట్లు ఎక్కువ ఉంటుందని సమాచారం. 19,960 చదరపు మీటర్లలో ఈ ఫాం హౌస్ విస్తరించి ఉంది. ఇందులో స్విమ్మింగ్ ఫూల్, బీచ్, ప్రైవేట్ హెలిప్యాడ్ లాంటి లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. దీన్ని ఎటాచ్ చేయడానికి కారణం.. ఈ ప్రదేశంలో షారుక్ ఖాన్ అక్రమంగా ఫాం హౌస్ నిర్మించడమే. అందులో నిబంధనలకు విరుద్ధంగా విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడమే. ఈ స్థలాన్ని వ్యవసాయం చేయడానికి అని చెప్పి షారుక్ ఖాన్ కొనుగోలు చేశారు. అయితే ఇక్కడ అలాంటిదేమీ చేయడం లేదు. విలాసవంతమైన సౌకర్యాలు కల్పించుకున్నారు. మహరాష్ట్ర చట్టాల ప్రకారం వ్యవసాయ భూమిలో ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలంటే స్థానిక కలెక్టర్ లేదా స్టేట్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలి. దీంతో ఈ ప్రాపర్టీ మీద ఐటీ శాఖ కన్నుపడింది.

 

షారుక్ ఖాన్‌కు సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంటుతో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు పంపారు.