పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఆతని సోదరుడు శివబాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలని అడిగినందుకు కులం పేరుతో తమని దూషించారంటూ కౌన్సిలర్ కృష్ణవేణి  బండ్ల సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.

 

కేసు వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కు చెందిన డాక్టర్ దిలీప్‌చంద్ర‌కి ఫరూఖ్‌నగర్ మండలం, బూర్గుల శివారులో భూములు, పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేశ్‌ ఒప్పందం చేసుకున్నారు. ఆ భూములపై బ్యాంకుల్లో అప్పటికే రుణాలు ఉండటంతో వాటిని చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒప్పందం‌లో పొందుపరిచారు. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ భూములతో పాటు దిలీప్ చంద్ర ఇంటిని కూడా సీజ్ చేశారు. అనంతరం బండ్ల గణేశ్ సోదరుల ద్వారానే వాటిని విక్రయించారు.

 

భూవిక్రయం తర్వాత తమకు రావాల్సిన డబ్బుల కోసం డాక్టర్ దిలీప్ చంద్ర, తన భార్య కౌన్సిలర్ కృష్ణవేణి‌తో కలిసి గణేశ్ పౌల్ట్రీ ఫాం కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ గణేశ్, అతని సోదరుడు శివబాబు తమని దూషించారంటూ కృష్ణవేణి‌ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్‌ సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్‌ తెలిపారు.