దర్శకుడు నాగ్అశ్విన్ మహానటి సినిమాను రూపొందించడానికి చాలానే కష్టపడ్డాడు. దాదాపు రెండేళ్ల పాటు సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. ఈ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి ఆయన సావిత్రి జీవితంలో కీలకపాత్రలు పోషించిన చాలా మందిని సంప్రదించారు. ఈ క్రమంలో సావిత్రి వీరాభిమాని సంజయ్ కిషోర్ ను కూడా కలిశారు. ఆయన ఈ సినిమా కోసం ఎంతగానో సహకరిస్తే వారు మాత్రం ఆయనకు కనీసం థాంక్స్ కార్డ్ కూడా వేయలేదని బహిరంగంగానే వెల్లడించాడు.

''సావిత్రికి సంబంధించిన ఎవరు ఎలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించినా అందులో నా గురించి ప్రస్తావన వస్తుంటుంది. అలానే నాగ్అశ్విన్ మరియు అతడి టీమ్ మెంబర్స్ వచ్చి నన్ను కలిశారు. ఆమెకు సంబంధించి నా దగ్గర ఉన్న మెటీరియల్ చూసి చాలా సంతోషించారు. వాళ్లకు అవసరమైనంత మెటీరియల్ తీసుకెళ్లారు. ఆ మెటీరియల్ వారు ఎంత ప్రయత్నించినా.. బయట దొరకదు. నేను సంపాదించడానికే చాలా ఏళ్లు పట్టింది. ఇంత కష్టపడి సేకరించిన వివరాలను వాళ్లకు ఇచ్చి సహకరిస్తే కనీసం నాకు థాంక్స్ కూడా వేయలేదు. డబ్బు రూపంలో నేనేదీ ఆశించలేదు కనీసం థాంక్స్ కార్డ్ వేసి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా వాళ్ల ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను'' అంటూ వెల్లడించారు సంజయ్ కిషోర్.