కొన్ని రోజుల క్రితం సంజయ్‌ దత్‌ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు 308మంది మహిళలతో సంబంధం ఉందని స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి అందరి మనసుల్లో ఒకటే అనుమానం...ఏం చూసి ఈ ‘ఖల్‌నాయక్‌’కు ఇంత మంది అమ్మాయిలు పడిపోయారా అని. అయితే ఈ సందేహాలకు ‘సంజు’ చిత్ర దర్శకుడు రాజ్‌ కుమార్‌ హీరానీ సమాధానం చెప్పారు.


తనతో పరిచయం అయిన ప్రతి అమ్మాయిని సంజయ్‌ ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆ సమాధిని తన తల్లిదని చెప్పేవాడు. దాంతో ఆ అమ్మాయి కాస్తా ఎమోషనల్‌ అయ్యి సంజయ్‌కు మరింత దగ్గరయ్యేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ సమాధి సంజయ్‌ తల్లిది కాదు.. నకిలీ సమాధి వద్దకు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేవాడు’ అని అసలు విషయం బయట పెట్టాడు రాజ్‌కుమార్‌ హీరానీ.


ఒకసారి ఓ అమ్మాయి సంజయ్‌తో బ్రేకప్‌ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్‌ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక కొత్త కారు పార్క్‌ చేసి ఉంది. సంజయ్‌ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్‌ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్‌ సంబంధాలు నడిపాడంట. 


ఈ విషయం గురించి రణ్‌బీర్‌ ‘నేను కేవలం పదిమంది అమ్మాయిలతోనే డేటింగ్‌ చేసాను. కానీ బాబా(సంజయ్‌ దత్‌) కౌంట్‌ 308’ అన్నాడు. అంతేకాక ప్రతిరోజు షూటింగ్‌ జరగడానికి ముందు రోజు రాత్రి రణ్‌బీర్‌ సంజయ్‌దత్‌కు ఫోన్‌ చేసేవాడంట. తరువాత రోజు షూటింగ్‌ జరిగే సన్నివేశాల గురించి సంజయ్‌తో చర్చించే వాడంట. ఆ సమయంలో సంజయ్‌ మనసు ఎలా ఉండేది...ఆ సంఘటనల గురించి ఎలా స్పందించేవాడని అడిగి తెలుసుకునే వాడినన్నాడు రణ్‌బీర్‌.


అంతేకాక సంజయ్‌ డ్రగ్స్‌కు బానిసయినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండేదో తెలిపే ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు రణ్‌బీర్‌. ‘ఒకానొక సమయంలో బాబా డ్రగ్స్‌కు తీవ్రంగా బానిసయ్యాడు. ఆ సమయంలో ఒకసారి బాబాకు తన తండ్రి సునిల్‌ దత్‌ సాబ్‌ తల మీద క్యాండిల్‌ వెలుగుతున్నట్లు అనిపించిందంట. సంజయ్‌ వెంటనే వెళ్లి ఆ క్యాండిల్‌ను తొలగించాడంట. సంజయ్‌ డ్రగ్స్‌కు ఎంతలా బానిసయ్యడనే విషయం అప్పుడు దత్‌సాబ్‌కు అర్థమయ్యింది‘ అని రణ్‌బీర్‌ తెలిపాడు.