తెలుగు ప్రేక్షకులు ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న బేధం లేకుండా సినీ హీరోలు, వారి కుటుంబాల పట్ల తరతరాలుగా అభిమానం కురిపిస్తున్నారు. అలానే టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత అక్కినేని వారింటి కోడలుగా అడుగుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రేక్షకులే కాదు అక్కినేని కుటుంబంతో తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ కుటుంబానికున్న సంబంధ బాంధవ్యాలు కూడా మామూలువి కాదు. రెండు కుటుంబాలకు వున్న పరస్పర సంబంధాల నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణ వివాదం అంతరంగికంగానే సమసిపోయిందనే వాదనలున్నాయి.

ఇక సమంత అక్కినేని కోడలుగా మారిన తర్వాత కల్వకుంట్ల కుటుంబంతో సంబంధాలు మరింత బలపడ్డాయి. నిజానికి సమంత అక్కినేని కోడలిగా అడుగుపెట్టక ముందు నుంచే హిరోయిన్ గా వున్న సమయం నుంచే తెలంగాణ సర్కారు అధినేత కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీతో.. మంచి అనుబంధం కొనసాగిస్తోంది. తెలంగాణ స్టేట్ హ్యాండ్‌లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (టెస్కో) బ్రాండ్ అంబాసిడర్‌గానూ సమంతను నియమించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ బ్రాండ్ ఎంబాజిడర్ గా తన వంతు పాత్ర పోషిస్తున్న సమంతను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి నేరుగా పనిచేసేలా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేయించాలనే యోచనలో కేటీఆర్ వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే టీఆర్ ఎస్ కు నేరుగా సినీ పరిశ్రమ మద్దతు లేదు. అధికారంలో వున్నారు కాబట్టి సినీ ప్రముఖుల నుంచి యునానిమస్ గా సపోర్ట్ వస్తున్నా... ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖులను ప్రచారం చేయించిన దాఖలాలు లేవు. గతంలో విజయశాంతి వుండేది. కానీ రాములమ్మ పార్టీ నుంచి వెళ్లాక సినీ గ్లామర్ లేకుండానే టీఆర్ ఎస్ ఉద్యమ గరిమతో అధికారంలోకి వచ్చింది.

ఇక ఈ సారి ఎన్నికల్లో సినీ గ్లామర్ ను కూడా వినియోగించుకోవాలనే యోచనలో కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ దిశగా ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సమంతను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రచారకర్తగా నియమించాలన్న కేసీఆర్ ఆదేశంతో... మంత్రి కేటీఆర్ కూడా సమంతతో ఆ దిశగా చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు సమంత ప్రచారం చేస్తే ఎన్నికల్లో కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

అందుకే సమంతను కేవలం ప్రచారానికి మాత్రమే వినియోగించుకుంటున్నారన్న విమర్శలు రాకుండా వుండేలా.. 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు నిర్ణయించిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి సహజనటి జయసుధ ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్థానికంగా వున్న మంత్రి పద్మారావును పార్లమెంట్ సీటుకు బరిలో నిలిపి సమంతను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ఎందుకంటే సికింద్రాబాద్ నియోజక వర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ. అందుకే గెలుపు ఈజీ అని, దాంతో పాటు పార్టీ తరపున సమంత ప్రచారం చేస్తే మాత్రం గ్యారంటీగా సినీ రాజకీయాలు పనిచేసి వచ్చే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవచ్చని గులాబీ బాస్ యోచిస్తున్నారట.

ఇప్పటికే సమంతకు తెలంగాణ సర్కారు అరుదైన, అపురూపమైన అవకాశాలు కూడా కల్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి వున్న అనుబంధంతోనే... ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కోసం తెలంగాణ సర్కారు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఓ అందమైన చీరను సమంత ద్వారా బహుకరించాలని ప్లాన్ చేశారు.

 

ఇవాంకా కోసం అద్భుత మైన సిద్దిపేట గొల్లభామ చీరలను ఇవాంకా కోసం సెలక్ట్ చేసింది సమంత. చీరకట్టులో తనకు సాటిలేదనిపించేలా వుండే సమంత.. ఈ గొల్లభామ చీరతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ గిఫ్ట్ బాక్స్‌ ను కూడా ప్రభుత్వం తరపున ఇవాంకకు అందజేసింది.

 

ఇలా సమంత చేతుల మీదుగానే తెలంగాణ సర్కారు ఇవాంకకు గిఫ్ట్ అందించే అవకాశం కల్పించిందంటే ఇరు కుటుంబాల మధ్య.. ముఖ్యంగా సమంత, కేటీఆర్ ల మధ్య ఎలాంటి అనుబంధం వుందో అర్థం చేసుకోవచ్చు.