Asianet News TeluguAsianet News Telugu

ఇవాంకా ట్రంప్- తెలంగాణ సర్కారు- సమంత- చేనేత చీరలు

  • ఇవాంకా ట్రంప్ కోసం విశిష్ట ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ సర్కారు
  • ఇవాంక కోసం విలువైన బహుమతులతోపాటు చీరలు బహుకరించనున్న టీ సర్కార్
  • ఇవాంక కోసం తెలంగాణ చేనేత చీరలను సెలెక్ట్ చేయాలని సమంతను కోరిన కేసీఆర్ సర్కార్
samantha selects ssaree for ivanka trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పుత్రిక ఇవాంకా తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేస్తుండటంతో నగరం అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రోడ్లు తళతళ మెరిసిపోతున్నాయి... ఎక్కడ చూసినా రంగు రంగుల బొమ్మలతో.. పచ్చదనంతో కలర్ పుల్ గా మారింది. ముఖ్యంగా శంషాబాద్ నుంచి హైటిక్ సిటీ, గచ్చిబౌలి పరిసరాల్లో ఎటుచూసినా అందమే. ట్రంప్ కుమార్తె ఎంట్రీ ఇస్తుండటంతో భాగ్యనగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.



ఇక ఇవాంకా ట్రంప్ కోసం తెలంగాణ సర్కారు అదిరిపోయే అతిథ్యాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ బిర్యానీతో పాటు.. అనేక రకాల వంటకాలను సిద్ధం చేస్తుండగా.. ట్రంప్ కుమార్తె లైఫ్ టైమ్ గుర్తుపెట్టుకునేలా విలువైన బహుమతులను రెడీ చేసారట కేసీఆర్. వీటన్నింటిలోనూ మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరకట్టుకున్న ప్రత్యేకత దృష్ట్యా ఓ అందమైన చీరను బహుకరించాలని ప్లాన్ చేశారు.

 

ఇవాంకాకు బహుకరించే చీరను ఎంపిక చేయాలని నటి సమంతను రంగంలోకి దింపారట. తెలంగాణా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంతను ఇవాంకా కోసం సిద్దిపేట నేత చీరల నుంచి అందమైనవి సెలక్ట్ చేయాలని అడిగారట. ఇవాంకా కోసం చీర సెలెక్ట్ చేయమంటే అక్కినేని కోడలు కాదంటుందా.. వెంటనే కొన్ని అద్భుత మైన సిద్దిపేట గొల్లభామ చీరలను ఇవాంకా కోసం సెలక్ట్ చేసిందట సమంత. చీరకట్టులో తనకు సాటిలేదనిపించేలా వుండే సమంత.. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ఇవాంక కోసం సిద్దిపేట గొల్లభామ చీరని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ బహుమతిని సమంతే స్వయంగా ఇవాంకకు అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

మన సిద్దిపేట గొల్లభామ చీర అమెరికా వైట్ హౌస్‌లో ఎగరనుంది. ఈ గొల్లభామ చీరతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ గిఫ్ట్ బాక్స్‌ను ఇవాంకకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చీర కూడా ఆ గిఫ్ట్ బాక్స్‌లో భాగంగానే ఇస్తారట. అంటే ఈ మొత్తం గిఫ్ట్ బాక్స్‌ను సమంత చేతుల మీదుగానే ఇవాంకకు అందించే అవకాశం ఉంది.

 

గొల్లభామ చీర చరిత్ర..
సిద్దిపేట గొల్లభామ చీరకు 50 ఏళ్ల చరిత్ర ఉంది. ఓ చేత్తో నెత్తిన పాల కుండ, మరో చేతిలో పెరుగు కుండ పట్టుకున్న గొల్ల్లభామ డిజైన్‌తో ఈ చీరలు ఉంటాయి. సిద్దిపేటకు చెందిన నేతన్నలు రచ్చ దేవదాస్, కొంక సాయిలు ఈ గొల్లభామ చీర సృష్టికర్తలు. వీరి అపూర్వ సృష్టి అయిన గొల్ల్లభామ చీర ప్రత్యేకతను భారత ప్రభుత్వం 2012లో గుర్తించింది. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిష్ట్రీ ఈ చీరకు భౌగోళిక గుర్తింపును ఇస్తూ ప్రత్యేకమైన ఎంబ్లమ్ కేటాయించింది. దీంతో ఈ చీరలపై సిద్దిపేట చేనేత సహకార సంఘానికి పేటెంట్ దక్కింది. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దిపేట చేనేత కార్మికులను పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరవాత స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చొరవతీసుకుని గొల్లభామ చీరకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చారు. దీనికి తోడు సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతో ‘గొల్లభామ’ బ్రాండ్‌కు మంచి గుర్తింపు దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios