ఏ మాయ చేసావె చిత్రం రీ రిలీజ్ అవుతుండడంతో సమంత, నాగ చైతన్య కలసి ప్రమోషన్స్ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ పై సమంత స్పందించింది.
‘ఏ మాయ చేసావె’ రీ రిలీజ్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావె’ విడుదలై 15 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఏ మాయ చేసావె చిత్రాన్ని జూలై 18, 2025న రీ రిలీజ్ చేస్తున్నారు. దీనితో గత కొద్దిరోజులుగా హీరో నాగ చైతన్య, సమంత మళ్లీ కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ చిత్రంతోనే నాగ చైతన్యకి హీరోగా తొలి విజయం దక్కింది. సమంత హీరోయిన్ పరిచయ అయింది ఈ చిత్రంతోనే.
ఈ నేపథ్యంలో సమంత రూత్ ప్రభు తాజా మీడియా ఇంటరాక్షన్‌లో ఈ గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చింది. “ఈ సినిమాలో నా మొదటి సన్నివేశం గేట్ వద్ద కార్తిక్‌ను మొదటిసారిగా కలిసే జెస్సి పాత్రలో నటించాను. ఈ మూవీలో ప్రతి ఫ్రేమ్ నాకు జ్ఞాపకమే. అద్భుతమైన అనుభవం అది. గౌతమ్ మీనన్ లాంటి దర్శకుడి చిత్రంలో నటించడం గొప్ప విషయంగా ఫీల్ అయ్యాను,” అంటూ షూటింగ్ రోజులను తలుచుకుంటూ సమంత భావోద్వేగంగా స్పందించింది.
ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు
కానీ, తాను నాగ చైతన్యతో కలిసి రీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. “నేను ప్రమోషన్లలోపాల్గొనడం లేదు. ఏ మాయ చేసావె చిత్రానికి సంబంధించిన వ్యక్తులు ఎవరితోనూ ప్రమోషన్స్ చేయడం లేదు” అంటూ స్పష్టం చేసింది. ఈ చిత్ర నటీనటులు కలసి ప్రమోషన్స్ చేయాలని అభిమానులు కోరుకుని ఉండొచ్చు. కానీ ప్రతిసారి వారి అంచనాలకు తగ్గట్లుగా ఉండడం కుదరదు. ఇలాంటి రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని సమంత పేర్కొంది.
చైతు, సమంత ఇద్దరికీ స్పెషల్ మూవీ
2010లో విడుదలైన ‘ఏ మాయ చేసావె’ చిత్రం సమంత, నాగ చైతన్య ఇద్దరికీ ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి, తర్వాత 2017లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, వివాహ జీవితానికి ముగింపు పలికిన ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు. నాగ చైతన్య శోభిత ధూళిపాల వివాహం గత ఏడాది జరిగింది. అయితే, సమంత మాత్రం సినిమాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో ‘ఏ మాయ చేసావే’ తిరిగి విడుదలవుతున్నా, తాను ప్రచారాల్లో పాల్గొనబోనని స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాకు సంబంధించి జ్ఞాపకాలు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఉన్నాయి. చైతూ-సామ్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. ఏ మాయ చేసావె తర్వాత నాగ చైతన్య, సమంత కలసి ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో నటించారు.
సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనితో ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత ఇటీవల నిర్మాతగా మారింది. తన సొంత నిర్మాణంలో ఆమె శుభం చిత్రాన్ని రూపొందించింది.
