సల్మాన్ ఖాన్ ఈ ఆఫర్‌కు ఒప్పుకుంటాడా? గుడికి వెళ్లి క్షమాపణలు చెబుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్‌తో పాటు బిష్ణోయ్ వర్గాల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాటర్ ఫుల్ ట్రెండింగ్.

సల్మాన్ ఖాన్‌కు మళ్లీ క్షమాపణల ఆఫర్; ‘

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బిష్ణోయ్ కమ్యూనిటీ మధ్య ఉన్న కృష్ణ జింకల వేట వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు 28 ఏళ్ల క్రితం నాటి ఈ కేసుకు ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. తాజాగా లారెన్స్ బిష్ణోయ్ బంధువు రమేష్ బిష్ణోయ్.. సల్మాన్ ఖాన్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు. బికనీర్‌లోని బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్ర స్థలమైన 'ముకామ్' గుడికి వచ్చి ఒక్కసారి క్షమాపణలు చెబితే చాలని ఆయన అన్నారు.

బిష్ణోయ్ సమాజం 542వ వ్యవస్థాపక దినోత్సవంలో రమేష్ మాట్లాడారు. సల్మాన్ ఖాన్‌ను గుడికి రావాలని ఆయన ఆహ్వానించారు. అంతేకాదు, సల్మాన్‌కు పూర్తి భద్రత కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇన్నేళ్లుగా నలుగుతున్న ఈ వివాదాన్ని ప్రశాంతంగా ముగించాలన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.

‘సల్మాన్ వచ్చి సారీ చెబితే చాలు’

ఓ పత్రికతో రమేష్ బిష్ణోయ్ ఫోన్‌లో మాట్లాడారు. బికనీర్‌లోని ముక్తి ధామ్ ముకామ్ గుడికి వచ్చి బిష్ణోయ్ కమ్యూనిటీకి సల్మాన్ సారీ చెప్పొచ్చని ఆయన సూచించారు. సల్మాన్ ఖాన్ లేదా ఆయన కుటుంబంపై తమకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని రమేష్ క్లారిటీ ఇచ్చారు. కమ్యూనిటీలో ఉన్న అసంతృప్తిని మాటల ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. "ఈ గొడవ ఇక్కడితో ముగిసిపోవాలి. సారీ చెబితే చాలు. ఈ వివాదం చాలా ఏళ్లుగా సాగుతోంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

గుడికి వెళ్తే తన కొడుకు భద్రత ఏంటని సల్మాన్ తండ్రి సలీం ఖాన్ గతంలో టెన్షన్ పడ్డారు. దీనిపై స్పందించిన రమేష్.. సల్మాన్‌కు వ్యక్తిగతంగా తాను భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న టైమ్‌లో రమేష్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. సల్మాన్‌పై దాడులు చేయడం లేదా చంపేస్తామని బెదిరించడాన్ని తాము సమర్థించబోమని ఆయన స్పష్టం చేశారు.

"లారెన్స్ గ్యాంగ్.. సల్మాన్‌పై లేదా ఆయనకు సంబంధించిన వాళ్లపై చేసే దాడులను నేను సపోర్ట్ చేయను" అని రమేష్ తేల్చి చెప్పారు. హింసకు దూరంగా ఉండాలని లారెన్స్‌తో పాటు మిగతా వాళ్లకు కూడా చాలాసార్లు చెప్పానన్నారు. కమ్యూనిటీ కోపాన్ని హింసతో కాకుండా, చర్చలు, క్షమాపణల ద్వారానే తగ్గించుకోవాలని ఆయన సూచించారు.

అసలు వివాదం మొదలైంది 1998లోనే..

ఈ వివాదం 1998 అక్టోబర్‌లో మొదలైంది. జోధ్‌పూర్ దగ్గర్లోని కంకణి గ్రామంలో సినిమా షూటింగ్ టైమ్‌లో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను వేటాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన బిష్ణోయ్ కమ్యూనిటీ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.

వన్యప్రాణులు, చెట్లను కాపాడటానికి బిష్ణోయ్ కమ్యూనిటీ చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. వాళ్లకు కృష్ణ జింకలు చాలా పవిత్రమైనవి. 15వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ పెట్టిన 29 నియమాలను ఈ కమ్యూనిటీ వాళ్లు పాటిస్తారు. రాజస్థాన్‌లోని బికనీర్, జోధ్‌పూర్, నాగోర్, బార్మర్‌తో పాటు హర్యానా, పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో వీళ్లు ఉన్నారు.

2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్ష కూడా వేసింది. ఆ తర్వాత ఆయనకు బెయిల్ దొరికింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌లను కోర్టు నిర్దోషులుగా వదిలేసింది.

సల్మాన్ భద్రతపై టెన్షన్.. మళ్లీ తెరపైకి గ్యాంగ్ బెదిరింపులు!

కృష్ణ జింకల కేసు తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు చాలాసార్లు బెదిరింపులు వచ్చాయి. 2024 ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ ఇంటి బయట దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో సల్మాన్ భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది.

బాలీవుడ్‌లోని ఇతర ప్రముఖులకు కూడా ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సల్మాన్, బిష్ణోయ్ కమ్యూనిటీ మధ్య ఉన్న గొడవ కేవలం పాత కేసుకే పరిమితం కాకుండా.. భద్రత, శాంతిభద్రతల సమస్యగా కూడా మారింది.

ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందా?

ఇన్నేళ్లుగా సాగుతున్న ఈ వివాదాన్ని ప్రశాంతంగా ముగించేందుకే రమేష్ బిష్ణోయ్ ఈ ఆఫర్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ముకామ్ గుడికి వచ్చి సారీ చెబితే కమ్యూనిటీ కోపం తగ్గుతుందని ఆయన భావిస్తున్నారు.

అయితే, రమేష్ ఆఫర్‌పై సల్మాన్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతారు? గుడికి వెళ్లే సాహసం చేస్తారా? అన్న ప్రశ్నలకు ఇంకా ఆన్సర్ దొరకలేదు. ప్రస్తుతానికి ఈ మ్యాటర్ బాలీవుడ్, బిష్ణోయ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.