సూర్య సరసన సాయిపల్లవి ప్రాజెక్ట్ మొదలైంది

First Published 3, Jan 2018, 12:51 AM IST
saipallavi to romance surya in next
Highlights
  • తెలుగు ప్రేక్షకులను ఫిదా మూవీతో ఫిదా చేసిన సాయిపల్లవి
  • తన ఫేవరైట్ హీరో ఎవరంటే పలు మార్లు సూర్య పేరు చెప్పిన పల్లవి
  • తాజాగా సూర్య సరసన సాయిపల్లవి నటించనున్న ప్రాజెక్ట్  ప్రారంభం

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్ సాయిపల్లవి. ప్రస్తుతం ఈ అమ్మాయికున్నంత క్రేజ్ వేరే ఏ హీరోయిన్‌కి లేదంటే అతిశయోక్తి కాదు. సింపుల్‌గా ఉంటూనే ప్రేక్షకులను తన నటన, హావభావాలతో కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఎంసీఏ’ సినిమాలోనూ సాయిపల్లవి ఆకట్టుకుంది. ఇప్పటి వరకు కుర్ర హీరోలతో నటించిన సాయిపల్లవి ఇప్పుడు ఏకంగా సూర్యతో జతకట్టింది. ఈ కొత్త సినిమా షూటింగ్ కూడా నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభమైంది.

‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. కార్తితో ‘ఖాకి’ చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని అందిస్తోంది. ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబులు నిర్మాతలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. సీనియర్‌ హీరో శివకుమార్‌, సూర్య, కార్తి ఈ సినమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది.

హీరో సూర్య మాట్లాడుతూ.. ‘నా గత 35 చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వ రాఘవన్‌ చెప్పిన సబ్జెక్ట్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. కమర్షియల్‌ విలువలతో కూడిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్‌ సాయిపల్లవి పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. సూర్యలాంటి వెర్సటైల్‌ హీరోతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు సెల్వ రాఘవన్ చెప్పారు. ఈ కథకు సూర్య ఒక్కరే యాప్ట్‌ అని సినిమా చూశాక మీకే తెలుస్తుందన్నారు.

నిర్మాతలు ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు మాట్లాడుతూ.. ‘సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మంచి సినిమా ఇది. రీసెంట్‌గా మా బేనర్‌లో రూపొందిన ‘ఖాకి’ మంచి హిట్‌ అయింది. సూర్య కెరీర్‌లో ఓ పెద్ద హిట్‌ సినిమా అయ్యేలా డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి 18న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి దీపావళికి చిత్రాన్ని రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’ అన్నారు.

loader