ప్రస్తుతం సినిమాల్లో డ్యాన్సులకు ఇంపార్టెన్స్ బాగా పెరిగిందని అనడంలో సందేహం లేదు. స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకు స్టెప్పులు ఇరగదీసేస్తున్నారు. జనాలకు తమలో ఉన్న మరో ట్యాలెంట్ ను కూడా చూపించేస్తున్నారు. ఇక మెగా హీరోల విషయానికి వస్తే.. డ్యాన్సుల విషయంలో అయితే వారిలో వారికే పోటీ కనిపిస్తోంది.

స్టెప్స్ విషయంలో చెర్రీ అందరికంటే ముందున్నాడని ఒప్పుకోవాలి. బన్నీ కూడా డ్యాన్సులు బ్రహ్మాండంగా చేస్తాడు. కానీ చరణ్ మాదిరిగా మూమెంట్ ఫినిషింగ్ తనకు ఇంకా అలవడలేదంటూ తనే ఓ సందర్భంగా ఒప్పుకున్నాడు. సాయిధరం తేజ్ కూడా డ్యాన్సులు కూడా బాగా చేస్తాడు. కాకపోతే మిగతా మెగా వారసులంతా తమ తమ స్టైల్ తోనే ఆకట్టుకుంటున్నారు తప్ప.. చిరంజీవిని కాపీ చేయాలనే ప్రయత్నించడం లేదు. కానీ తేజుపై ఈ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ఇంటెలిజెంట్ మూవీకి నా సెల్ ఫోన్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

ఇందులో చివరగా చూపించిన సిగ్నేచర్ స్టెప్ ను చూస్తే.. మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150లో అమ్మడు కుమ్ముడు సాంగ్ లోని సిగ్నేచర్ స్టెప్ ను కాసింత డెవలప్ చేశారనే సంగతి తెలిసిపోతోంది. అసలు చిరును గుర్తు చేసే ఉద్దేశ్యంతోనే ఈ స్టెప్ ను సెట్ చేసి ఉండవచ్చు. అసలే చిరు.. పవన్ లను ఇమిటేట్ చేస్తాడంటూ సాయిధరం తేజ్ ను విమర్శించే వాళ్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడు స్టెప్పులు కూడా కాపీ చేసేయడం కరెక్ట్ కాదేమో తేజూ.. కాసింత ఆలోచించరాదూ!