`కాంతార` హీరో రిషబ్‌ శెట్టి వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తెలుగుపై ఆయన ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే ఓ మూవీలో నటిస్తుండగా తాజాగా మరో కొత్త మూవీ ప్రకటన వచ్చింది. 

DID YOU
KNOW
?
`కాంతార 2` రిలీజ్‌ డేట్‌
రిషబ్ శెట్టి తన కన్నడ మూవీ 'కాంతార'తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దక్కించుకున్నాడు. 'కాంతార 2' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కన్నడ స్టార్‌ రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగు హీరో అయిపోతున్నారు. ఆయన `కాంతార` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ డబ్‌ అయి ఆకట్టుకుంది. సంచలన విజయం సాధించింది. 

దీనికి ఇప్పుడు `కాంతార 2` రాబోతుంది. ఈ మూవీ అక్టోబర్‌ 2న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

`జై హనుమాన్‌`లో హీరోగా నటిస్తున్న రిషబ్‌ శెట్టి 

ఇదిలా ఉంటే రిషబ్‌ శెట్టి తెలుగులో ఇప్పటికే `జై హనుమాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. 

ఇది భారీ పాన్‌ ఇండియా మూవీగా, హనుమంతుడి కథతో రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తెలుగు సినిమాలో రిషబ్‌ శెట్టి కనిపించబోతున్నారు.

 ఆయన మరో వీరుడి కథతో రూపొందబోతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామాగా రిషబ్‌ శెట్టి మరో తెలుగు సినిమా 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రిషబ్‌ శెట్టి ఈ చిత్రం చేస్తుండటం విశేషం. ఆ విశేషాలను ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది. `ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో చేతులు కలిపారు రిషబ్‌ శెట్టి.

 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. 

మంచి కథకుడిగా పేరు గాంచిన, ప్రతిభావంతులైన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన ఓ అద్భుతమైన కథతో ప్రేక్షుకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు` అని టీమ్‌ వెల్లడించింది.

రెండు భాషల్లో చిత్రీకరణ 

చిత్ర బృందం ఇంకా చెబుతూ, `ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించబడుతుంది. తెలుగు, కన్నడతోపాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 

ప్రొడక్షన్ నెం.36 గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు` అని వెల్లడించింది.

Scroll to load tweet…