రుద్రమదేవి రైటర్ రాజ సింహా సూసైడ్ వెనుక.. అసలు ఏమి జరిగిందంటే..

సినీ రచయిత రాజసింహ ఆత్మహత్యాయత్నం చేశాడని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజం కావని తేలింది. జరిగింది ఒకటైతే మీడియాలో వచ్చింది మరొకటని ఆయన స్వయంగా తెలిపాడు. తనకు షుగర్ వ్యాధి ఉందని, ముంబైలో ఉండగా ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగడంతో స్పృహ తప్పి పడిపోయానని స్పష్టం చేస్తూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు.

తనవద్ద ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లానని, ఎవరో తనను ఆసుపత్రికి తీసుకువెళ్ళారని రాజసింహ చెప్పాడు. ‘ ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగు పడింది. నా హెల్త్ గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తాను ‘ అని ఆయన పేర్కొన్నాడు. ‘ రుద్రమదేవి ‘, అనగనగా ఓ ధీరుడు ‘ వంటి సినిమాలకు సంభాషణలు రాసిన రాజసింహ.. సందీప్ కిషన్ హీరోగా తీసిన ‘ ఒక్క అమ్మాయి తప్ప ‘ అనే మూవీకి దర్శకత్వం వహించాడు. అయితే ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదని, దాంతో డిప్రెషన్ కు గురై ఆత్మహత్యా యత్నం చేశాడని వార్తలు వచ్చాయి.