సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కడప రాయలసీమ రెడ్ల చరిత్ర వెబ్ సిరీస్ వివాదం ముదురుతోంది. రాయలసీమ రెడ్లపై ‘కడప’ పేరుతో వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేయటంతో వివాదానికి మరింత ఆజ్యం పోశారు. సహజంగానే వివాదాలతో పబ్లిసిటీ దక్కించుకునే వర్మ తన తాజా వెబ్ సిరీస్ తో మరింత అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు.


‘రాయలసీమ రెడ్ల చరిత్ర’ మీద వెబ్ సిరిస్ పై గత శుక్రవారం కడప పేరుతో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ఒళ్లుగగుర్పొడిచే హింసాత్మక సన్నివేశాలు, బూతు పదాలు సెక్స్ కంటెంట్‌తో నింపేసి.. మరో సారి తన గన్స్ అండ్ థైస్ తరహాలో తెలుగులో ట్రైలర్ రిలీజ్ చేసి వివాదానికి కేరాఫ్ అడ్రస్ వర్మ  అన్న పేరుని సార్థకం చేసుకున్నాడు.  సినిమాల్లో సెన్సార్ బోర్డ్ అడ్డుతగలడంతో తన క్రియేటివిటీని మొత్తం యూట్యూబ్‌ ద్వారా బయటపెట్టేశాడు వర్మ. ఫ్యాక్షన్ అమ్మ వెలిసింది సీమలో.. ఆ అమ్మ గుడి రాయసీమ అయితే.. గర్భగుడి కడప.. ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర అంటూ వర్మ ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్‌లో తనకు తెలిసిన కడప చరిత్రను చెప్పే ప్రయత్నం చేశాడు వర్మ.


అయితే ప్రశాంతగా ఉన్న రాయలసీమను ఫ్యాక్షన్ అడ్డాగా చూపిస్తూ.. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని వెంటనే వర్మను అరెస్ట్ చేయాలంటూ రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కడప అంటేనే హింస అన్నట్టు ఈ ట్రైలర్‌లో ఒళ్లుగగురుపడిచే హింసాత్మక సన్నివేశాలను చూపించారని వెంటనే వర్మను అరెస్ట్ చేయాలంటూ.. ఆదివారం అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


కడప వెబ్ సిరీస్ విడుదల చేస్తే.. వర్మ తీవ్ర పరిణామాణాలు ఎదుర్కోవల్సి వస్తుందని సమితి కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. రామ్ గోపాల్ వర్మ వినోదం కోసం తీసింది సీమ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సీమ ప్రజల్ని రాక్షసులుగా చూపిస్తూ కక్షసాధిస్తున్నారని.. వీటివల్ల రాయలసీమ యువత చాలా నష్టపోతుందన్నారు. వర్మను వెంటనే అరెస్ట్ చేయకపోతే కోర్టుకు వెళతామని, పిల్ దాఖలు చేయడానికైనా సిద్ధమేనని రాయలసీమ విమోచన సమితి నాయకులు అంటున్నారు.